
అపార నష్టం
అకాల వర్షం..
● ఏఎంసీ ఐకేపీ సెంటర్‌లో
తడిసిన వేలాది బస్తాల ధాన్యం
● జిల్లా వ్యాప్తంగా మామిడికి తీవ్రనష్టం
● కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం, తడిసిన బస్తాలు
● కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు
● తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
● క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్, ఉన్నతాధికారులు
జనగామ: వరిగింజ పొట్టదశలో మొహం చాటేసిన వరణుడు, ధాన్యం అమ్ముకునే సమయంలో అకాల వర్షాలు వెంటాడుతున్నాడు. దిగుబడులు తగ్గి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న రైతుల ఆశలను అడియాశలవుతున్నాయి. వరికోతలు ప్రారంభమైన నాటి నుంచి అడపదడపా వర్షాలు కురుస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి 9 నుంచి రెండు గంటల పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో వరి, మామిడి, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం జరిగింది. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి వరదకు కొట్టుకుపోయాయి. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు రాలి పోగా.... విద్యుత్ శాఖకు అపార నష్టం మిగిల్చింది.
ఏఎంసీ ఐకేపీ సెంటర్‌లో తడిసిన ధాన్యం
జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ సెంటర్‌లో వందలాది బస్తాల ధాన్యం తడిసి పోయింది. ఎగువ ప్రాంతం నుంచి వరదతో సుమారు 15 నుంచి 20 బస్తాల గింజలు కొట్టుకుపోయాయి. యార్డులో ధాన్యం రాశుల చుట్టూ వరద నిలిచిపోవడంతో చిన్నపాటి కుంటలను తలపించాయి. సెంటర్‌కు వచ్చి 10 నుంచి 20 రోజులు గడిచి పో తున్నా.. ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, తహసీల్దార్ హుస్సేన్‌తో కలిసి ఆర్డీఓ గోపీరామ్ సెంటర్‌కు వచ్చి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని భరోసా కల్పించారు.
నేలరాలిన మామిడి
జిల్లాలో కురిసిన భారీ వర్షంతో వరి, మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 3 వందల ఎకరాల మామిడి తోటల పరిధిలో కాయలు రాలినట్లు హార్టీకల్చర్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లి ధాన్యం కొనుగోలు సెంటర్‌ను రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే జిల్లాలోని మాదాపురం, సింగరాజుపల్లి, లింగాలఘణపురం, చీటూరు, పటేల్‌గూడెం, కుందారం, వెంకటాద్రిపేట, వడ్లకొండ, అడవికేశ్వాపూర్, తిమ్మంపేట, విస్నూరు, చెన్నూరు, మంచుప్పుల, కన్నెబోయినగూడెం తదితర గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లను ఆర్డీఓ, తహసీల్దార్లు, ఉన్నతాధికారులు సందర్శించి, అక్కడి పరిస్థితిని అంచనా వేసి కలెక్టర్‌కు రిపోర్టు చేశారు. తరిగొప్పుల మండలం అబ్దులనాగారం, రఘునాథపల్లి, పాలకుర్తి, బచ్చన్నపేట, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొ ట్టుకుపోగా, పలు చోట్ల మామిడికాయలు రాలి పోయాయి. నర్మెట మండలంలో ఓ రైస్ మిల్లు రేకులు ఎగిరి పోగా, గోడలు కూలిపోయాయి.
జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలో)
వర్షపు నీటిని తొలగిస్తున్న రైతు
జిల్లాలో 22.4 మిల్లీ మీటర్లు
వానాకాలంలో పత్తాలేని వరణుడు, 43 డిగ్రీల ఉష్ణోగ్రతల సమయంలో అకాల వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. 5వ తేదీ రాత్రి జిల్లాలో 22.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైయింది. ధా న్యం తడిసి పోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరి గి, కరెంటు తీగలపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
పాలకుర్తి(గూడూరు) 62.8
పాలకుర్తి 46.0
తరిగొప్పుల 37.3
తరిగొప్పుల(అబ్దుల్ నాగారం) 33.8
నర్మెట 33.8
జఫర్‌గఢ్ 31.3
దేవరుప్పుల 27.8
లింగాఘణపురం 27.3
దేవరుప్పుల 26.0
బచ్చన్నపేట 25.0
జనగామ 20.0
స్టేషన్‌ఘన్‌పూర్ 20.0
రఘునాథపల్లి 17.5
కొడకండ్ల 1.3

అపార నష్టం

అపార నష్టం

అపార నష్టం

అపార నష్టం