జనగామ రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి టెన్త్ వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 41 సెంటర్లలో 6,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, కుర్చీలు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలన్నారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో నిర్ధేశించిన ఆయా రూట్లలో మాత్రమే పరీక్ష పేపర్లను ఆయా కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి 6304062768 కంట్రోల్ రూం నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీజీఈ రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ రామరాజు, జీసీడీఓ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించాలి
దివ్యాంగులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్‌తో కలిసి దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, దానిలో భాగంగానే ఈ సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 66 మంది దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించి వారి ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న 6,238 మంది విద్యార్థులు