
మాట్లాడుతున్న శ్రీనివాసరావు
దేవరుప్పుల: ప్రయాణికుల ముంగిట ఆర్టీసీ సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ‘ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు’ అనే అంశంపై సర్పంచ్ ఈదునూరి రమాదేవి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుమల దర్శనానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే స్పెషల్ దర్శనం, పెళ్లిళ్లు శుభకార్యాలకు అడ్వాన్సు లేకుండా అద్దె బస్సులను 10శాతం రాయితీతో సమకూర్చుతున్నామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపర్చే క్రమంలో ప్రయాణికుల ఆదరణ కీలకమన్నారు. దేవరుప్పులలో బస్టాండు పునరుద్ధరణ కోసం ఉన్నతాఽధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోటకూరి రేణుక కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, కారోబార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.