అక్రమంగా పట్టా చేసుకున్నరు..

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ శివలింగయ్య, వివిధ శాఖల అధికారులు
 - Sakshi

జనగామ రూరల్‌: ‘అల్లుడు, కూతురు మోసం చేసి భూమి పట్టా చేసుకున్నరని ఒకరు.. 20 గుంటల భూమి కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నానంటూ మరొకరు.. కోర్టులో కేసున్నా భూమిని తమ పేరు మార్చుకున్నారంటూ ఇంకొకరు’.. ఇలా సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వచ్చిన బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ప్రజావాణికి 47 అర్జీలు రాగా.. అందులో భూమి సమస్యలపైనే అధికంగా ఉన్నాయి. వాటిని కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య ఇతర అధికారులు స్వీకరించా రు. వినతుల్లో తహసీల్దార్‌ పరిధి 24, ఆర్డీఓ 4, ఎస్సీ సంక్షేమాధికారి 6, డీఆర్డీఓ, మున్సిపల్‌, పోలీస్‌ శాఖలకు రెండు చొప్పున, డీపీఓ, ఉపాధి, బీసీవెల్ఫేర్‌, వ్యవసాయం, ఆర్‌అండ్‌బీ, చైల్డ్‌ వెల్ఫే ర్‌, ఎస్సారెస్పీ విభాగాలకు ఒకటి చొప్పున వచ్చా యి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వినతులను పరిశీలించి సత్వరం సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అల్లుడు అక్రమంగా పట్టా చేసుకున్నాడు

నాకు 533 ఎఫ్‌ 11 సర్వే నంబర్‌లో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉంది. అల్లుడు కారు కొనుక్కుంటానని నమ్మించి తహసీల్దార్‌ కార్యాలయంలో సంతకం చేయించుకుని భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడు. పోయిన సంవత్సరం నుంచి ‘రైతుబంధు’ పైసలు వస్తలెవ్వు. భూమి నా పేర పట్టా చేయించాలి.

– జాటోతు ద్వాలి, పలువోడుతండా(కొడకండ్ల)

ఎస్‌ఆర్‌ ఇవ్వడం లేదు

ఎస్సీ హాస్టల్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నేను 317 జీఓ ద్వారా మహబూబాబాద్‌కు బదిలీ అయ్యాను. సంబంధిత అధికారి ఎస్‌ఆర్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. అలాగే 2016 నుంచి 2021 వరకు ఇంక్రిమెంట్‌, లీవులు నమోదు చేయలేదు. ఎలాగైనా న్యాయం చేయాలి.

– అరూరి శ్రీనివాస్‌,

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎస్సీ హాస్టల్‌ వాచ్‌మన్‌

గ్రీవెన్స్‌లో బాధితుల మొర

వివిధ సమస్యలపై 47 అర్జీలు

అధికంగా భూమి సమస్యలపైనే..

సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top