జగిత్యాలజోన్: మా నాన్నే.. నా మొదటి గురువు. నేను జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నానంటే అంతా మా నాన్న భిక్షే. మాది రాజమండ్రి. నాన్న చిత్తూరి లక్ష్మణ్‌రావు(లచ్చారావు) న్యాయవాది. నా రోల్ మోడల్, నా ఇన్‌స్పిరేషన్ అంతా నాన్నే. అమ్మాయిలంటే ఇంటి పని, వంట పని కాదని, ఉన్నత స్థాయికి ఎదిగి, నీవే పది మందికి ఆదర్శంగా మారాలని ఎప్పుడు చెపుతుండేవారు. నాది సైన్స్ గ్రూపు అయినా నాన్నను ఆదర్శంగా తీసుకుని ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. నాన్న నాపై చూపెడుతున్న ప్రేమ, అనురాగాలతో యూనివర్శిటీ స్థాయిలో నాలుగు గోల్డ్‌మెడల్ సాధించేవరకు తీసుకవచ్చాయి. తర్వాత నాన్న వద్దే అడ్వకేట్‌గా శిష్యరికం తీసుకున్నా. నాన్న జ్యూడిషియల్ వ్యవస్థలో ఉన్న మంచి చెడులు చెపుతుండడం, పది మందికి న్యాయం చేస్తే మనకు కలిగే మనశ్శాంతి, అనుభూతుల గురించి వివరించేవారు. దీంతో, అడ్వకేట్‌గా కేసులు వాదించే స్థాయి నుంచి జడ్జిగా కేసుల్లో తీర్పులు ఇచ్చే స్థాయికి ఎదిగానంటే అంతా మా నాన్న చలవే. అందుకే జీవితాంతం నాన్నకు రుణపడి ఉంటాను. చిన్నప్పుడు నాన్నతో ఉన్న జ్ఞాపకాలు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని బరువైన జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. నాన్నను తలచుకోని రోజు ఉండదు. నాన్నతో పాటు అమ్మ ప్రేమలత, పెంచిన అమ్మ అన్నపూర్ణమ్మ, తమ్ముడు శ్రీనివాస్‌లు కూడా నా పురోభివృద్ధికి కారణం.
– సి.రత్నపద్మావతి, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి


