ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం ప్రత్యామ్నాయాల వైపు రైతుల అడుగులు పడేనా? ఉమ్మడి జిల్లాలో గణనీయంగా తగ్గనున్న వరి ఇతర పంటలు వేయాలంటున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
వానాకాలం ప్రారంభమైందంటే ఉమ్మడి కరీంనగర్‌లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరి స్థితుల నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షాలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగునీటి లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో వ్యవసాయశాఖ అధికారులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. కొ న్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి ప్రధాన పంటగా మారింది. యాసంగిలో రాష్ట్రం రికార్డుస్థాయిలో వరి ఉత్పత్తి సాధించగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికంగా సాగైంది. ప్రస్తుత వానాకాలంలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజ న్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే వరిసాగు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో, నారుమడులు వేయడంపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు.
స్వల్పకాలిక వరి రకాలపై కానరాని ఆసక్తి
వర్షాభావ సూచనలు, నీటి లభ్యతపై అనిశ్చితి, సాగు ఖర్చుల పెరుగుదలతో ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, నువ్వులు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం మేలని చెబుతున్నారు. వరివేస్తే 120రోజుల్లోపు పండే స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రచా రం చేస్తున్నప్పటికీ రైతుల్లో ఆశించిన స్పందన కని పించడం లేదు. అధిక దిగుబడి ఆశతో చాలా మంది దీర్ఘకాలిక వరి రకాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భూగర్భ జలాల్లో క్షీణత
అధికారులు ఆందోళన చెందుతున్నట్లుగా లోటు వర్షపాతం నమోదైతే.. ఆ ప్రభావం తప్పకుండా భూగర్భ జలాలపై ఉంటుంది. అదే సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పట్లో నీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఉమ్మడి జిల్లాకు సాగు, తాగు నీటికి ప్రాణాధారంగా భావించే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే వరదపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంతోపాటు ఎగువన కూడా లోటు వర్షపాతం నమోదైతే కాలువల ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయే ప్రమాదముంది. వరద కాలువలు, ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల భూగర్భ జలాలు సంతృప్తస్థాయిలో ఉంటాయి. కాలువల్లో నీరు తగ్గితే.. వీటి పరివాహక ప్రాంతాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు పడిపోతాయని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(లక్షల ఎకరాల్లో)
ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో
సాగు వివరాలు


