సాయంత్రానికి సరిహద్దు దాటిన దుండగులు
కేవలం ఆరుగంటల్లో సురక్షితంగా రాష్ట్రం వెలుపలికి
ధర్మపురిలో దొరికిన పల్సర్, ఆచూకీ లేని అపాచీ
కారు నంబరుతో పల్సర్, చాసిస్ నంబరు ధ్వంసం
రామడుగు మీదుగా రెండుసార్లు సంచారం
బోర్నపల్లి లేదా కమ్మునూరు వంతెనలు దాటి మహారాష్ట్రకు
పీఎంజీ జువెల్లరీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
ధర్మపురిలో
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్‌లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్‌ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్‌జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్‌లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్‌గానే భావిస్తున్నారు.


