రాష్ట్రంలో ప్రజావంచన పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రజావంచన పాలన

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

జగిత్యాలటౌన్‌: రాష్ట్రంలో ప్రజావంచన పాలన సాగుతోందని, ధాన్యం సేకరణపై రైతులు రోడ్డెక్కితేగానీ ప్రభుత్వంలో చలనం రాకపోవడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను వంచిస్తుంటే చూస్తూ ఉండలేక, రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయని రేవంత్‌ ప్రభుత్వాన్ని సమర్థించలేక కాంగ్రెస్‌ పార్టీ నుండి బయటకు వచ్చానని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోడంతోనే జిల్లాలో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. జిల్లాలోని పలుచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసి వారం రోజులు గడుస్తున్నా తరలించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు రేవంత్‌రెడ్డిని నమ్మబోరని తెలిసే రైతాంగ సమస్యలపై రాహుల్‌గాంధీతో వరంగల్‌ డిక్లరేషన్‌లో హామీలు ఇప్పించారని, ఆ హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదని అన్నారు. రుణమాఫీ సగం ఎగ్గొట్టారని, ప్రభుత్వం 25శాతం ప్రీమియం చెల్లించకపోవడంతో రాష్ట్రంలో పంటల బీమా అమలుకు నోచుకోవడంలేదన్నారు. పూడూరు రైతు ధర్నాతో జిల్లా మంత్రి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని, సమీక్షతోనే సరిపెట్టకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. పక్కనే ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో 7లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను ఇప్పటికే 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని జగిత్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికీ 5శాతం మించి కొనుగోళ్లు కూడా జరగలేదన్నారు. ఉన్నమాటంటే కాంగ్రెస్‌ నాయకులు ఉలిక్కిపడుతన్నారని అన్నారు. తమపై ప్రతి విమర్శలు మానుకుని ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు కొనుగోళ్లు జరపాలని, కొనుగోలు చేసిన 24గంటల్లో ధాన్యాన్ని తరలించాలని కోరారు. గోదాం సౌకర్యం లేని పక్షంలో ఎక్కడికక్కడ నెట్టింగ్‌ వేయాలో కలెక్టర్‌ చర్యలు చేపట్టాలని కోరారు. అంతకు ముందు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ ప్రజాసంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. జీవన్‌రెడ్డి లేకుంటే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ ఉండేది కాదన్నారు. అలాంటి జీవన్‌రెడ్డిపై చోటామోటా నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో హరిచరణ్‌రావు, గాజుల రాజేందర్‌, దేవేందర్‌నాయక్‌, సాగర్‌రావు, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై ముందుచూపులేని సర్కారు

జగిత్యాలరూరల్‌: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని, కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం బట్టపల్లిపోతారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి మంగళవారం పరిశీలించారు. నెలరోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తేమశాతం పడిపోయి ధాన్యం బరువు తగ్గే అవకాశం ఉందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. హమాలీల కొరత లేకుండా చూసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడారు. నాయకులు సత్యంరావు, రాంచందర్‌రెడ్డి, మధు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

రైతాంగం రోడ్డెక్కితేగాని ప్రభుత్వానికి సోయి లేదు

ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement