జగిత్యాల: కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఏసీబీ అధికారుల బృందం చేరుకుంది. డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు సిబ్బంది సోదాలు చేపడుతున్నారు. సోదాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.
అవినీతి ఆరోపణలపైనేనా..!
సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో అంగన్‌వాడీ టీచర్లు కొందరు ఆ శాఖ అధికారులపై ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. గతంలో పనిచేసిన అధికారులపైనా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికారుల లావాదేవీలను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు నేరుగానే ఉన్నతాధికారులపైనే ఫిర్యాదు చేశారు. గతంలోనే అధికారులు విచారించారు. తాజాగా ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై డీఎస్పీని వివరణ కోరగా.. తనిఖీల్లో భాగంగానే సోదాలు చేశామన్నారు.
నాడు మున్సిపాలిటీ.. నేడు సంక్షేమ శాఖ కార్యాలయం
ఇటీవల ఏసీబీ అధికారులు సుమారు 15 మంది మున్సిపల్ కార్యాలయంలో సుమారు 10 గంటలకు పైగానే సోదాలు నిర్వహించారు. ప్రతి శాఖలోని రికార్డులను పరిశీలించి అందులో జరిగిన అవినీతి, అక్రమాలను వెల్లడించారు. రికార్డులను ఉన్నతస్థాయి అధికారులకు పంపించారు. తాజాగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల అందులో పనిచేస్తున్న ఓ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అవినీతి అక్రమాలు బయటపడితే మరింతమందిపై వేటు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


