కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్యలు, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులో చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్‌ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్‌రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్‌హౌజ్‌లో గడుపుతున్న విలాసవంతమైన కేటీఆర్ జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్‌కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్‌ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడీ, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా..? చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్‌కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.


