గంట ముందే స్పాట్‌కు! | - | Sakshi
Sakshi News home page

గంట ముందే స్పాట్‌కు!

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

న్యాట్‌గ్రిడ్‌ సాయంతో..

రామడుగు మీదుగా వచ్చి ఆ దారినే వెళ్లిన దొంగలు

మధ్యలో వాహనాలు మార్చిన దుండగులు?

న్యాట్‌గ్రిడ్‌, సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా కీలక ఆధారాలు

పీఎంజే దర్యాప్తులో పురోగతి

సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్న పోలీసులు

నిందితుల వేటకు మహారాష్ట్ర, బిహార్‌కు మరో 4 టీంలు

చోరులు వదిలేసిన మహారాష్ట్ర బ్యాగు కీలకం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

గరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్‌కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్‌ జిల్లాలతో పాటు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్‌ మేనర్‌’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్‌)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్‌కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..?

చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్‌ నందూర్బర్‌’ అని రాసి ఉంది. నందూర్బర్‌ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్‌ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్‌గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్‌, చెక్‌పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్‌, రామడుగు, లక్ష్మీపూ ర్‌, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్‌కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్‌ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్‌, ఇటువైపు హైదరాబాద్‌ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్‌ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ గ్రిడ్‌ (నాట్‌గ్రిడ్‌) సాఫ్ట్‌వేర్‌ సాయంతో వారి నేరచరిత, ఎఫ్‌ఐఆర్‌, జైలు జీవితం, ఫోన్‌నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు.

బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్‌గ్రిడ్‌లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్‌ను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (ఆర్‌ఏడబ్ల్యూ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి.

గతేడాది నుంచి ఈ డేటాబేస్‌ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్‌ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం.

నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్‌టవర్ల పరిధిలో అనుమానిత సెల్‌ఫోన్‌ సంభాషణల కోసం డంప్‌ (సెల్‌ టవర్‌ నుంచి వెళ్లిన కాల్స్‌ వివరాలు)ను సీడాట్‌ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు.

ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement