అంతా నిమిషాల్లోనే.. | - | Sakshi
Sakshi News home page

అంతా నిమిషాల్లోనే..

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌క్రైం:

దివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్‌ – విద్యుత్‌ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్‌ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్‌ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వచ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషాల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సైగలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్‌, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్‌ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డి, క్లూస్‌టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్‌ షెల్స్‌, మ్యాగ్జిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్‌ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హై దరాబాద్‌ నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది రాత్రి పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు.

బీదర్‌ లేదా మహారాష్ట్ర వైపు?

జ్యోతినగర్‌లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్‌లోకి లేదా జగిత్యా ల రూట్‌లో పారిపోవచ్చని స్కెచ్‌ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్‌ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్‌, బీదర్‌ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మాస్కులు లేకుండానే దర్జాగా

ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్‌ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్‌లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్‌ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్‌ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మ్యాగ్జిన్‌.. బులెట్లు స్వాధీనం

ఘటనా స్థలంలో ఓ షార్ట్‌ వెపన్‌ మ్యాగ్జిన్‌, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్‌, బులెట్లపై ఉన్న క్లూస్‌ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు.

నాడు మొరాదాబాద్‌ దొంగలు

2022 సెప్టెంబరు 5న కరీంనగర్‌లోని సెవెన్‌హిల్స్‌ సమీపంలో సాయివాణి రెడీమిక్స్‌కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్‌ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్‌ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ వెళ్లారు. నిందితులు ధరంపాల్‌, మనీశ్‌, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ఉన్న సృజన్‌రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

పలువురి పరామర్శ

ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పరిశీలించారు. గాయపడిన జువెల్లరీస్‌ సిబ్బంది ముస్తాక్‌, మధుకర్‌, రాజేశ్‌, కమలాసన్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల, పాడి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రరెడ్డి సూచించారు.

రెక్కీ చేశాకే పీఎంజే జ్యువెల్స్‌లో చోరీ

ఐదు నిమిషాల్లో ముగించి.. రెండు బైకులపై పరారీ

నిందితులు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు?

2022లో మొరాదాబాద్‌ దొంగల తరహాలోనే దోపిడీ

దుండగులు వచ్చిన దారి వెంట సీసీ ఫుటేజీల పరిశీలన

Advertisement
 
Advertisement
Advertisement