● అందుకే రైతులకు కష్టాలు
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: మిల్లుల్లోని ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తరలించడంలో జాప్యంతోనే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ కుమార్ అన్నారు. రైస్‌మిల్లుల గోదాంల నుంచి ధాన్యం తరలించేలా కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్‌లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్‌లు సతీష్ పాల్గొన్నారు.
నిరుపేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, సారంగాపూర్ మండలం పెంబట్ల, గణేష్‌పల్లి, బీర్‌పూర్ మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 2400 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయన్నారు. ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, కేడీసీసీబీ మాజీ మెంబర్ రాంచందర్‌రావు, ఎంపీడీవో సలీం, చిరంజీవి, భీమేష్, సర్పంచ్‌లు రాధ, శ్రీనివాస్, హరీశ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన మక్కలను కొనే దిక్కులేదన్నారు. రైతులంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. మక్కలు ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టడమేంటని నిలదీశారు. సన్నాలకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు బైరి మల్లేశ్ పాల్గొన్నారు.
టీబీ రోగులకు మెరుగైన వైద్యం
● డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాస్
జగిత్యాలరూరల్: టీబీ రోగులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌లో బస్తీ దావా ఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలతోపాటు నెల నెలా మందులు కూడా అందిస్తోందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
జగిత్యాలక్రైం: కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ షాపులో తుపాకులతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడగా.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అణువణువునా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. అనుమానితులను విచారణ చేపడుతున్నారు. నిందితుల చిత్రాలను పోలీసులు విడుదల చేయడంతో అనుమానితులు కన్పిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు.


