● అనారోగ్యంతో యువకుడి మృతి
● తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు
శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో యాకుబ్(35) మరణించగా, కుటుంబసభ్యులు తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేశవపట్నం గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మకు కొడుకు యాకుబ్, కూతురు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి, యాకుబ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వీరయ్య, రుక్కమ్మలు రోడ్డు పక్కన టేలాలో చెప్పులు విక్రయించగా, ప్రస్తుతం వ్యాపారం లేక పోవడంతో కేశవపట్నం మేన్ రోడ్డుపై తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. యాకుబ్ రోడ్డుపక్కన గదిలో ఉండగా ఆదివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై యాకుబ్ శవాన్ని తల్లిదండ్రులతో పాటు సోదరి, బావ తీసుకెళ్లారు.
సాహిత్యంతో పౌర సమాజం జాగృతం
కరీంనగర్‌కల్చరల్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలింభవన్‌లో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ఆదివారం శ్రీకవన గోదారిశ్రీ కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్‌రెడ్డి, డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్, బొమ్మకంటి కిషన్, అనిత పాల్గొన్నారు.


