కొత్తపల్లి(కరీంనగర్): 220 కె.వీ. దుర్శేడ్ విద్యుత్‌సబ్‌స్టేషన్ ఆవరణలోని పోల్ సెంటర్‌లో ఆదివారం రా త్రి మంటలు చెలరేగాయి. గాలి దుమారం రావడంతో అల్గునూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 32 కె.వీ. లైన్లు ఒకదానికొకటి రాపిడి జరిగి అగ్ని రవ్వలు కిండపడ్డాయి. అక్కడున్న చెత్త, గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుర్శేడ్ సబ్‌స్టేషన్‌ను ఆఫ్ చేసి ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్‌లైంది. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విద్యుత్ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్‌కో డీఈ భూమయ్య వెల్లడించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాల క్రైం: జగిత్యాలలోని వాణీనగర్‌కు చెందిన విద్యుత్ శాఖ లైన్‌మన్ రమేశ్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. రమేశ్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో డబ్బులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


