నేటి నుంచి రైతు వారం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైతు వారం

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

కరీంనగర్‌ అర్బన్‌/జగిత్యాలఅగ్రికల్చర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యాచరణను రూపొందించగా సోమవారం నుంచి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం సాగు రంగానికి చేసిన సేవలు, విప్లవాత్మక మార్పులు, పంట రుణాలు, గతంలో చేసిన రుణమాఫీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అందులో భాగంగా ఈ నెల 4నుంచి 9 వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రైతు వారం నిర్వహించనున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలైన పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, ఆత్మ, వ్యవసాయ మార్కెటింగ్‌, పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నదాతకు అవగాహన కల్పించనున్నారు. కాగా, రైతు వేదికలే వేదికగా ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు వివరించారు.

కార్యక్రమాలు ఇలా..

4వ తేదీన: సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలను వివరించనున్నారు.

5న: ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఆదాయం, ఆయా పంటల అభివృద్ధి, ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు.

6న పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, మార్కెటింగ్‌ అవకాశాలు.

7న: వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్‌ కేంద్రాలు, పీఎం కుసుమ్‌, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్‌.

8న: వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశువుల సంరక్షణ వంటి వివరాలు.

9న: చెరువుల్లో కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత.

వివిధ కార్యక్రమాల రూపకల్పన

రైతు వేదికల్లో నిర్వహణ

భూసార పరీక్ష ఫలితాల వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement