సమ్మర్‌ క్యాంపుపై సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ క్యాంపుపై సందిగ్ధం

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలపై ఈసారి సందిగ్ధం నెలకొంది. ఏడేళ్లుగా (కరోనా వైరస్‌, ఎన్నికల కోడ్‌ మినహా) నిరంతరంగా కొనసాగుతున్న శిబిరాలు ఈసారి ఉంటాయా? లేదా? అన్న సందేహం కోచ్‌లు, తల్లిదండ్రులు, చిన్నారులను కలవరపెడుతోంది. 2017 నుంచి వేసవి శిబిరాలను ప్రారంభించిన నగరపాలక సంస్థ 2020, 2021లో కరోనా వైరస్‌ కారణంగా, 2024లో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి అడ్డంకి లేకున్నా శిబిరాల నిర్వహణపై నగరపాలక సంస్థ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. శిబిరాలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

భారం అనుకుంటున్నారా?

నగరంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉందని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే పాలు, గుడ్లు, అరటి పండ్లు, కోచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాల భారం తప్పించుకోవడానికే శిబిరాలను పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి పెంచే ఈ శిబిరాలు నిలిచిపోతే, యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి శిబిరాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు.

శిబిరం నిర్వహణపై బల్దియా మౌనం

ఉచిత శిక్షణ శిబిరాల సంప్రదాయానికి బ్రేక్‌?

నిరాశలో చిన్నారులు, తల్లిదండ్రులు

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంపు నిర్వహణ ఇలా

ఏడాది క్రీడలు కోచ్‌లు చిన్నారులు గౌరవవేతనం

2017 17 28 1,500 రూ.5,000

2018 20 40 2,500 రూ.5,000

2019 22 45 2,600 రూ.5,000

2022 27 72 3,200 రూ.5,000

2023 28 70 3,000 రూ.8,000

2025 17 35 1,700 ఇవ్వలేదు

Advertisement
 
Advertisement
Advertisement