అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
● ఏ ‘ఆధార’మూ లేని చిన్నారులు
● చేరదీసిన అమ్మమ్మ, నాన్నమ్మ
● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ బాలుడు పుట్టు మూగ. కన్నవారి ప్రేమకు నోచుకోలేదు. ఏ ఆధారమూ లేదు. కనీసం ఆధార్ కార్డు కూడా లేని అభాగ్యుడు. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామపంచాయతీ పరిధి బీరప్పతండాకు చెందిన బట్టు శంకు పుట్టుకతోనే మూగ. అతడు పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. అప్పటి నుంచి తన అమ్మమ్మ బట్టు నానుకు వద్దే పెరుగుతున్నాడు. కనీసం ఆధార్ కార్డు కూడా లేక దివ్యాంగుల పింఛన్, చదువు, ఇతర పథకాలకు దూరమయ్యాడు.
మనవడే ప్రాణం
భర్త మరణించిన తర్వాత నానుకు అండగా నిలిచేవారు కరువయ్యారు. వృద్ధాప్య పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేక, చిన్న పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. మనవడు శంకును సాకడం ఆమెకు భారంగా మారింది. వయసు మళ్లినా కూలీ పనులకు వెళ్తే వచ్చే ఆదాయంతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు ఏదోలా రెక్కలు ముక్కలు చేసుకుంటానని, తర్వాత తన మనవడిని ఎవరు చూసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి బాలుడికి ఆధార్ ఇప్పించి, పింఛన్ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు.
మరో బాలుడిది అదే వ్యథ
బీరప్పతండాకే చెందిన మరో బాలుడు బట్టు శివ పరిస్థితి కూడా ఇంతే. అతడి తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియదు. నాన్నమ్మ బట్టు సక్కుబాయి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మమకారానికి దూరమై, తోటి పిల్లలను చూస్తూ ఈ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సదరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
బీరప్ప తండాలో బట్టు నాను, ఆమె మనవడు శంకు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. తక్షణమే ఆ బాలుడికి ఆధార్ నమోదు చేయించి, బట్టు నానుకు పింఛన్ వచ్చేలా కృషి చేస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా చూస్తాం.
– బట్టు కృష్ణ, సర్పంచ్, బంజేరు


