పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. పడిపోతున్న భూగర్భజలం ఏప్రిల్‌లో 5.50 మీటర్ల లోతుకు చేరిన నీరు కొడిమ్యాల మండలంలో 13.03 మీటర్ల లోతులో గంగమ్మ
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం పెరిగిపోయి భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతి ఇంటికి బోరుబావి ఉండడం.. ఇష్టారీతిన వినియోగిస్తుండడంతో గంగమ్మ క్రమంగా లోతుకు చేరుతోంది. ఏప్రిల్‌లో మున్సిపాలిటీ పరిధిలో పరిశీలిస్తే జగిత్యాలలో 8.25మీటర్లు, కోరుట్ల 9.62, మెట్‌పల్లి లో 6.65, రాయికల్‌లో 3.21, ధర్మపురిలో 5.96 మీ టర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది.
నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో..
నాన్ ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింత పడిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో జలాలు భారీగా తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో 6.96మీటర్లు, కొడిమ్యాలలో 13.03, కథలాపూర్‌లో 3.42, మేడిపల్లిలో 6.53, భీమారంలో 4.51మీటర్లకు పడిపోయింది.
ఒక్క నెలలోనే 0.52 మీటర్లు..
ఒక్కనెలలోనే నీటిమట్టం 0.52మీటర్లకు పడిపోయింది. మార్చిలో 4.98 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఏప్రిల్ చివరినాటికి 0.52 మీటర్లు పడిపోయి ప్రస్తుతం 5.50 మీటర్లకు చేరుకుంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 0.07 మీటర్లు తగ్గినట్లయ్యింది. ఏప్రిల్ చివరి నాటికి బీర్‌పూర్ మండలంలో 2.94 మీటర్ల లోతులో నీరు ఉండగా.. 13.03 మీటర్ల లోతులో కొడిమ్యాల మండలంలో నీరు ఉండటం గమనార్హం.
ఆయకట్టు మండలాల్లోను అంతంతే
ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారం మండలంలో 5.35 మీటర్లు, ఎండపల్లిలో 7.13, గొల్లపల్లిలో 5.05, జగిత్యాల రూరల్‌లో 3.22, పెగడపల్లిలో 5.10, సారంగాపూర్‌లో 6.01, వెల్గటూర్‌లో 3.19, ఇబ్రహీంపట్నంలో 5.19, మల్లాపూర్‌లో 6.43 మీటర్లలోతుకు జలం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మేలో మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉన్నందున నీటిని పోదుపుగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగిత్యాలఅగ్రికల్చర్:
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. వేసవిలో రోజువారి అవసరాలకు నీటి వినియోగం ఎక్కువ కావడంతో నీటిమట్టం లోతుకు చేరుతోంది. కేవలం ఒక్క ఏప్రిల్ నెలలోనే నీటిమట్టం 0.52 మీటర్లు పడిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక మే నెలలో మరెంత పడిపోతుందోనని ఆందోళన మొదలైంది.
బోర్లు తవ్వాలంటే వాల్టా చట్టం ప్రకారం భూగర్భజల శాఖ అనుమతి తీసుకోవాలి. బోరు యంత్రాలు కూడా భూగర్భశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనుమతి లేకుండా తవ్వితే భారీ జరిమానాలు ఉంటాయి. భూగర్భజలాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి.
– శ్రీకాంత్, భూగర్భజల శాఖాధికారి
బోర్లకు అనుమతి తప్పనిసరి


