ఉద్యోగం నుంచి బాలల పరిరక్షణ అధికారి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం నుంచి బాలల పరిరక్షణ అధికారి తొలగింపు

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

జగిత్యాల: జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.హరీశ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హరీశ్‌పై మహిళాఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు, విధుల్లో ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలపై సదరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల పనిప్రదేశాల్లో వేధింపుల చట్టం కింద షోకాజ్‌ నోటీసులు జారీ చేసి పద్ధతి మార్చుకోవాలని ఉన్నతాధికారులు మందలించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉద్యోగులు మరోసారి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని ఉన్నతాధికారులు తేల్చి నివేదిక అందించారు. పరిశీలించిన కలెక్టర్‌ డీసీపీవో హరీశ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌ కమిషనర్లు

జగిత్యాల/మెట్‌పల్లి: జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌గా సత్యప్రణవ్‌, మెట్‌పల్లి కమిషనర్‌గా శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలో పనిచేసిన స్పందన బదిలీపై వెళ్లిపోవడంతో గ్రూప్‌–1 అధికారి సత్యప్రణవ్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే డీఆర్‌డీఏ జిల్లా సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌ను డిప్యూటేషన్‌పై మెట్‌పల్లి కమిషనర్‌గా నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను పలు విభాగాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

గ్యాస్‌ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు

జగిత్యాల: గ్యాస్‌ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు అని జెడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధరలను రూ.993కు పెంచడంతో పేదలపై భారం పడుతుందన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కమర్శియల్‌ గ్యాస్‌ ఆరుసార్లు పెంచడం ద్వారా చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీస్టాల్స్‌ మూతపడి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయన్నారు. కార్మికుల దినోత్సవం రోజున సిలిండర్‌ ధరలు పెంచి మోదీ సామాన్యుల నడ్డీ విరిచారన్నారు. ఇప్పటికై నా ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్‌ సత్యప్రణవ్‌

బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement