ధర్మపురి: ప్రజాపాలన కార్యక్రమంతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురిలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, గత ప్రభుత్వ హయాంలో అందించని పథకాలను కాంగ్రెస్ అందిస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.450 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. తొలి విడుత రూ.115కోట్లు విడుదలైనట్లు తెలిపారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, డిగ్రీ కళాశాల మంజూరైందని, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండేళ్లలో 474 మంది రైతులకు రైతుబీమా పథకం ద్వారా రూ.18.7 కోట్లు అందించామని వివరించారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు.
ధర్మపురిని టెంపుల్ సిటీగా మార్చుతాం: కలెక్టర్
ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని టెంపుల్ సిటీ, మాస్టర్ ప్లాన్ అమలుకు ఫైనల్ అయిందని, త్వరలోనే సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.దినేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య తదితరులున్నారు.


