రాయికల్: పట్టణంలోని వైకుంఠధామం అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ కింద మంజూరు చేసిన రూ.82 లక్షలను పక్కదారి పట్టించేందుకు కాంట్రాక్టర్ యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయికల్ బల్దియాకు టీయూఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.82 లక్షలు ౖవైకుంఠధామానికి కేటాయించారు. ఆ పనులను పూర్తి చేసేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్ చేయడంలో ఆలస్యమైంది. అదే సమయంలో ప్రభుత్వం ప్రతీ మునిపాలిటీకి శ్మశాన వాటికల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ కింద రూ.కోటి మంజూరు చేసింది. రూ.కోటితో టెండర్ పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్ వైకుంఠధామంలో కాంపౌండ్‌వాల్, బర్నింగ్‌షెడ్, టాయిలెట్స్ నిర్మాణం, వుడ్ స్టోరేజీ వంటివి నిర్మించి చేతులు దులుపుకున్నాడు. టీయూఎఫ్‌ఐడీసీ కింద మంజూరైన రూ.82 లక్షల టెండర్ కాగా.. ఆ నిధులన్నీ వృథాగా ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ శ్మశాన వాటికలో సీసీరోడ్ల నిర్మాణం చేసేందుకు అప్పటి కమిషనర్, చైర్మన్‌ను కోరగా.. వారు తిరస్కరించారు. అవే నిధులతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు మళ్లించాలని సంబంధిత కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకురావడంతో కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ రూ.82 లక్షలను పట్టణంలోని కొన్ని కుల సంఘ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు చేసుకోవడానికి పట్టణంలోని ఓ కాంట్రాక్టర్ ఫైల్ తయారుచేసి నూతన పాలకవర్గం ఆమోదం కాకముందే పాత కమిషనర్‌తో ఆమోదించినట్లుగా ఫైల్ క్రియేట్ చేసి ఈ నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నూతన పాలకమండలి చైర్మన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కమిషనర్ కీర్తి నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా వైకుంఠధామం నిర్మాణం కోసం మంజూరైన నిధులు వాటి అభివృద్ధికి కేటాయిస్తామని, మరే ఇతర పనులకు మళ్లించబోమని తెలిపారు. వైకుంఠధామంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి సుందరీకరణ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


