గొల్లపల్లి(పెగడపల్లి): రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, శాసీ్త్రయ దృక్పథంతో వ్యవసాయం చేసినప్పుడే అధిక లాభాలు గడించవచ్చని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు స్వాతి, దీపిక సూచించారు. గురువారం పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో రైతులకు సలహాలు, సూచనలు అందించారు. మార్కెట్లో ఏ వరి రకాలకు అధిక డిమాండ్ ఉందో గమనించి.. వాటిని సాగు చేయడం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. నేల ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు, ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. భూసార సంరక్షణ కోసం పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని వివరించారు. ఏటా ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు. వరి కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను కాల్చడం ద్వారా నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతాయని హెచ్చరించారు. వాటిని కాల్చకుండా నేలలోనే కలియదున్నడం ద్వారా భూమికి సహజ సిద్ధమైన బలం చేకూరుతుందన్నారు. పురుగు, తెగుళ్లు, కలుపు నివారణ మందులను వ్యవసాయ అధికారుల సలహా మేరకు నిర్దేశించిన మోతాదులో మాత్రమే వాడుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలను రైతులకు వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు ఉన్న ఆవశ్యకతను, ఆ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అక్షయ్ కుమార్, ఎల్లాపూర్, రామభద్రునిపల్లి, రాజరంపల్లె, కీచులాటపల్లి గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.


