జగిత్యాల: అది జిల్లాకేంద్రంలోని అతిపెద్ద జనరల్ ఆస్పత్రి. ఇక్కడ మెడికల్ కళాశాల అందుబాటులోకి రావడంతో రోగులతో నిత్యం కిటకిటలాడుతోంది. కానీ.. ఇంతపెద్ద జనరల్ ఆస్పత్రిలో రోగులకు కావాల్సిన సౌకర్యాలు మాత్రం కరువయ్యాయి. అత్యవసరమైన మందులు సరిపడా లేవు. ఎవరైనా గుండెనొప్పితోనే.. ప్రమాదం జరిగి కాలో, చెయ్యో విరిగినా తీసేందుకు ఎక్స్‌రే పనిచేయడం లేదు. ఈసీజీకి సంబంధించి పేపర్ అందుబాటులో లేకపోవడంతో ప్రింట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రోగులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కూడా ఏమీ చేయలేక మొబైల్ ఫోన్లలో ఫొటో తీసి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కొంతమంది వద్ద స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం సమస్యగా మారింది. కొన్నిరోజులుగా ఈ సమస్యలు వేధిస్తున్నా.. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. రోగులు బయటి ఆస్పత్రుల్లో ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. ఈసీజీనీ అక్కడే చేయించుకుంటున్నారు. మందులను ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్నారు.
నిత్యం వెయ్యిమందికి పైగానే..
ఆస్పత్రికి జిల్లాకేంద్రంతోపాటు, ఇతర జిల్లాలు, మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికి పైగానే రోగులు వస్తుంటారు. జ్వరం, ఇతరత్రా రోగాలతో బాధపడుతున్న వారు వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా ఇదే ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. అయితే రోగులకు కావాల్సిన మందులు, ఈసీజీ ప్రింట్ అవుట్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌స్ లేకపోవడంతో వైద్యులు బయట తీయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. చిన్నచిన్న మందులకు కూడా ప్రస్తుతం బడ్జెట్ లేక తెప్పించడం లేదని ఆస్పత్రి వర్గాలే పేర్కొంటున్నాయి.
కొరత ఉన్న మందులు
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం అవసరమయ్యే మందులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా స్పిరిట్, కాటన్, లాబెటలాల్, నెపెంటిన్, లివోప్రిన్, బివీవైకై న్, ఎనామిన్, మెపెంట్రినిన్ వంటివాటితోపాటు పారసెట్‌మల్, ఇతరత్రా మందులు లేకపోవడంతో అత్యవసర సమయంలో రోగులకు ఇబ్బందిగా మారింది. సిబ్బందికి అవసరమయ్యే గ్లౌస్‌లు లేవని పేర్కొంటున్నారు. సర్జికల్‌కు సంబంధించిన సామగ్రిని వెంటనే తెప్పించేలా చూడాలని ఆస్పత్రి వర్గాలే పేర్కొంటున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పనిచేయని ఎక్స్‌రే
ఈసీజీకి ప్రింట్లు కరువు
సరిపడా లేని మందులు
పట్టించుకోని అధికారులు


