జగిత్యాలటౌన్: కేంద్రీయ విద్యాలయానికి జిల్లాకేంద్రంలో స్థలం కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలతోపాటు నిజామాబాద్, వనపర్తికి కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని, జగిత్యాలలో స్థలమే కేటాయించలేదన్నారు. ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి స్థలం కేటాయింపులో జాప్యంపై స్పందించాలన్నారు. ఈనెల 15లోపు స్థలం గుర్తించాలని, లేకుంటే ఆర్డీవో కార్యాలయం ఎదుట ఽనిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, నాయకులు గంగాధర్, ఆముద రాజు, మ్యాదరి అశోక్, రమేశ్ పాల్గొన్నారు.
నిరుపేద వైద్యానికి రూ.1.20లక్షల విరాళం
ధర్మపురి: ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద విద్యార్థినికి వైద్య ఖర్చుల కోసం ఫేస్‌బుక్ మిత్రులు స్పందించి రూ.1.20 లక్షలు విరాళాలు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన లింగమల్ల లక్ష్మణ్, సుమిత్ర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. లక్ష్మణ్ గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిన పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కూతురు శ్రీహిత (17) ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఐదు నెలల క్రితం అనారోగ్యానికి గురైంది. వైద్యం కోసం సుమారు రూ. 3లక్షల వరకు అప్పు చేశాడు. ప్రస్తుతం శ్రీహిత కోలుకున్నా.. మరో ఐదు నెలలు మందులు వాడాలని, వివిధ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కూతురు వైద్య ఖర్చులు లక్ష్మణ్‌కు భారం కాగా వీరి విషయాన్ని తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ ఏప్రిల్ 3న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఎన్నారైలు, ఇతర దాతలు స్పందించి లక్ష్మణ్ బ్యాంకు ఖాతాకు రూ.1.20 లక్షలు విరాళంగా అందించారు. ఆ సొమ్మును ఎస్‌బీఐ అధికారుల చేతుల మీదుగా రమేశ్ పంపిణీ చేయించాడు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ నీచ రాజకీయాలు
కోరుట్ల: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని బెల్లంపెల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మహిళా ఆక్రోశ సమ్మేళనం నిర్వహించారు. 76 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహిళలకు నారీశక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభల్లో సముచిత స్థానం లభించిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వచ్చిన ఈ చట్టంతోలోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పలు పార్టీలు ఈ చట్టాన్ని అడ్డుకోవటం సరికాదన్నారు. మహిళల కోసం కేంద్రం అనేక పథకాలు తీసకొచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, అనూప్ రావు, జగి త్యాల ఇన్‌చార్జి బోగ ఽశ్రావణి, ఐఎంఏ మహిళా అధ్యక్షురాలు స్వీతీ అనూప్, నాయకులు పిండేరు భానుప్రియ, వడ్డేపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారా యణ, మెట్‌పల్లి, జగిత్యాల పట్టణ అధ్యక్షులు నవీణ్, కొక్కు గంగాధర్, కోరుట్ల, మెట్‌పల్లి మున్సి పల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
సామూహిక నిరాహార దీక్షకు తరలిరండి
జగిత్యాల:206 సంఘాలతో ఏర్పడిన టీజీఈజేఏసీ విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న సామూహిక నిరాహార దీక్ష చేపడుతున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. జూన్ 2లోపు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు ఒకేసారి చెల్లించాలని, హెల్త్‌కార్డులు అమలు చేయాలన్నారు. దీక్షలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


