‘కొప్పుల’ను విమర్శించడం మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘కొప్పుల’ను విమర్శించడం మానుకోవాలి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

ధర్మపురి: అభివృద్ధి పనులు చేయకుండా.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను విమర్శించడం మానుకోవాలని డీసీఎమ్మెస్‌ మాజీ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ధర్మపురిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా... ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయని, కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ పాలనలోనే ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గోదావరి పుష్కరాలకు ఏడాది మాత్రమే సమయం ఉందని, ఎక్కడా పని మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంగి సత్తమ్మ, నాయకులు అయ్యోరి రాజేష్‌, బండారి రంజిత్‌, చిలువేరు శ్యామ్‌సుందర్‌ తదితరులున్నారు.

ఇసుక మాఫియాపై సస్పెక్ట్‌ షీట్లు

కరీంనగర్‌రూరల్‌: ఇసుక అక్రమ రవాణాదారులపై సస్పెక్ట్‌ షీట్లు ఓపెన్‌ చేస్తున్నట్లు కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఇసుక అక్రమ రవాణా చేస్తు పట్టుబడిన నగునూరుకు చెందిన వల్లెపు వెంకటేశ్‌, ఇరుకుల్లకు చెందిన సంకరి శ్రీనివాస్‌లను తహసీల్దార్‌ ఎదుట రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్‌ చేసినట్లు వివరించారు. అయినా పలుమార్లు ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన బొమ్మకల్‌కు చెందిన గాలిపల్లి నరేందర్‌, నేరెల్ల శ్రీనివాస్‌పై సస్పెక్ట్‌ షీట్లు ఓపెన్‌ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 16మంది ఇసుక అక్రమరవాణదారులపై సస్పెక్ట్‌షీట్లు ఓపెన్‌ చేయడం జరిగిందని, మరోమారు పట్టుబడినట్లయితే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని సీఐ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

పురుడుపోసిన 108 సిబ్బంది

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని కందికట్కూర్‌ గ్రామంలో బిహార్‌కు చెందిన భార్యాభర్తలు పూజభవాని, కరంబీర్‌ నివాసముంటున్నారు. పూజభవాని నిండు గర్భిణి. మంగళవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రసవం కోసం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్‌ సాయంతో 108 సిబ్బంది కూనబోయిన రాజశేఖర్‌, చెరకు దినేశ్‌ పురుడుపోయగా, మగబిడ్డ జన్మించాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ విజేతగా కరీంనగర్‌

రామకృష్ణాపూర్‌: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పట్టణంలోని సింగరేణి ఠాగూర్‌ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఖే లో ఇండియా అండర్‌–16 బాలికల ఫుట్‌బాల్‌ పోటీలు బుధవారం ముగిశాయి. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో కరీంనగర్‌, రంగారెడ్డి జట్లు ఫైనల్స్‌కు చేరాయి. కరీంనగర్‌ జట్టు 1–0 తేడాతో ఛాంపియన్‌గా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచాయి.

క్రీడలకు సమయం కేటాయించాలి

క్రీడల కోసం సమయం కేటాయించాలని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఖేలో ఇండియా పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా రాణించాలంటే పట్టుదల ముఖ్యమన్నారు. స్థానిక ఠాగూర్‌ స్టేడియంలో టర్ఫ్‌ వికెట్‌ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, స్థానిక ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్‌ మధుకుమార్‌, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement