జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్‌లో రైతులు పండించిన మక్కలను కొంటున్న మార్క్‌ఫెడ్ సంస్థ.. రైతులకు అనేక కొర్రీలు పెడుతోంది. ఫలితంగా కష్టపడి పంట పండించినప్పటికీ అమ్ముకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వంతో పోరాడే మార్గం లేకపోవడం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి
యాసంగి సీజన్‌లో జిల్లాలో దాదాపు 46,298 ఎకరాల్లో సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన దాదాపు 16 నుంచి 18 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కాగా.. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.1800గా ఉంది. రైతుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. గతంలో లేనివిధంగా మార్క్‌ఫెడ్ లేనిపోని కొర్రీలు పెడుతోంది. ఫలితంగా మద్దతు ధర రైతులకు అందకుండాపోతోంది.
తక్కువ ధరకు దళారులకు విక్రయం
నిబంధనలు తెలియని రైతులు పంటను కేంద్రంలో పోస్తున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులు వచ్చి ఇన్ని నిబంధనలు చెప్పేసరికి నోరెళ్లపెడుతున్నారు. అక్కడ 25 క్వింటాళ్లు విక్రయించి మిగిలిన పంటను దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా లేనిపోని నిబంధనలతో చాలా మంది రైతులు ఇప్పటికే క్వింటాల్‌కు రూ.1800 నుంచి రూ.1900 చొప్పున కోళ్ల ఫారాలు, వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1.50లక్షల క్వింటాళ్ల మక్కలు కొన్నప్పటికీ ఒక్క రైతుకు కూడా రూపాయి జమ చేయలేదు. డబ్బులు రావాలంటే 15 నుంచి నెలరోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.
నత్తనడకన కొనుగోళ్లు
మక్కల కొనుగోళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. రోజు 40 నుంచి 50 లారీల మక్కలు కొంటున్నట్లు అధికారులు చెబుతున్నా అన్ని కేంద్రాల్లో భారీగానే పేరుకుపోతున్నాయి. మార్క్‌ఫెడ్‌కు ఊహించని రీతిలో మక్కలు వస్తుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మక్కలను నిల్వ చేసేందుకు గోదాంలు దొరకకపోవడంతో తూకం వేసిన బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయి.
పంట ఎంతొచ్చినా.. కొనేది 25 క్వింటాళ్లే!
మొక్కజొన్న ఎకరాన 40 క్వింటాళ్ల దిగుబడి
విధి లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు
మక్కలు పండించినట్లు పోర్టల్‌లో ఉంటేనే కొనుగోలు
25 క్వింటాళ్లే కొనుగోలు
మక్కలను మార్క్‌ఫెడ్‌కు అమ్మాలంటే ముందుగా పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నమోదు చేసి ఉండాలి. ఇన్ని ఎకరాల్లో వేసినట్లు ఏఈవోలకు సమాచారం ఇవ్వకపోయినా.. ఒకవేళ ఏఈవో ఏదో కారణంతో నమోదు చేయకపోయినా ప్రస్తుతం అమ్ముకునే పరిస్థితి లేదు. ఎకరాకు ఎన్ని క్వింటాళ్లు పండించినా 25 క్వింటాళ్లే కొంటున్నారు. రైతులు ఇతర రైతుల పేర్లపై నమోదు చేయించుకుని పంటను విక్రయించుకో వాల్సిన దుస్థితి వచ్చింది. పైగా రైతు విక్రయించే సమయంలో వేలిముద్ర తప్పనిసరి చేయడం రైతులను మరింత క్షోభకు గురిచేస్తోంది.


