చెరువులపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

చెరువులపై ఫోకస్‌

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

ఆక్రమణల గుర్తింపు ‘హైడ్రా’ తరహా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం కలెక్టర్‌ ఆధ్వర్యంలో చెరువులు, కుంటల సర్వే

జగిత్యాల: గతంలో హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు కబ్జాకు గురికావడంతో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ ల్యాండ్‌ సర్వే అధికారులు, మండల పరిధిలో రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే అధికారులు ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, వాగులు, కుంటలను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు.

కమిటీ పరిశీలన మేరకు..

ప్రభుత్వం ఒక ఫార్మట్‌ ఏర్పాటు చేసి దాని ఆధారంగా నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు చెరువులు, కుంటలు, వాగులను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, వాగులను గుర్తించి వాటి ఫొటోలు తీసి ఎంత విస్తీర్ణం, ఆక్రమణకు ఎంత గురైందో నివేదిక పంపించేలా నమూనా జారీ చేశారు. నమూనా ఫాంలో మండలం, విలేజ్‌, ట్యాంక్‌, గుర్తించిన తేదీ, ఎంకై ్వరి చేసిన తేదీలను అధికారులకు పంపించాలి. ఇందులో ఫారెస్ట్‌, తహసీల్దార్‌, మండల సర్వేయర్‌, ఎంపీడీవో, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొంటారు. అధికారులు ఏ మేరకు కబ్జాకు గురయ్యాయో వాటిని వివరంగా తీసుకుని జిల్లా ల్యాండ్‌ సర్వే అధికారులకు పంపిస్తారు. ఇప్పటికే తహసీల్దార్ల ఆధ్వర్యంలో చెరువులను వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని గుర్తిస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలస్థాయిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు హద్దులు గుర్తిస్తున్నారు.

హైడ్రా తరహాలో అమలయ్యేనా..?

జిల్లా కేంద్రంతో పాటు, వివిధ మండలాలు, గ్రామాల్లోని 740 చెరువులు చాలా వరకు కబ్జాకు గురైనవే ఉన్నాయి. వాటికి హద్దులు లేకపోవడంతో ఇష్టానుసారంగా చెరువుల చుట్టే నిర్మాణాలు చేపట్టారు. కొందరు బఫర్‌ జోన్‌ పరిధిలో ఇళ్లు సైతం నిర్మించారు. మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూములకు అత్యధికంగా రేట్లు పలకడంతో చెరువులకు సంబంధించిన భూములపై ఆక్రమణదారుల కన్నుపడి అవి కుదించుకుపోతున్నాయి. దీంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలను నీళ్లు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ వేయడంతో హైడ్రా తరహాలో అమలైతే చెరువులు మళ్లీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రా తరహాలో అమలు చేయాలని ప్రజలు సైతం కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement