పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: నిరుపేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటలో గోపినేని రాజమల్లు, లావణ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్రామగ్రామాన పండుగలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయయని, పట్టణంలో 4500 డబుల్‌ బెడ్‌ రూం నిర్మించామని పేర్కొన్నారు. నిరుపేదలకు నూతన రేషన్‌ కార్డు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌ చెట్లపల్లి రమ, శంకర్‌ రెడ్డి, రాజు, మాజీ సర్పంచ్‌లు రమణరావు, శేఖర్‌ గౌడ్‌, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

కొండగట్టు నిత్యాన్నదాన సత్రానికి రూ.లక్ష విరాళం

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి హన్మకొండకు చెందిన భక్తులు కె.వినయ్‌కుమార్‌, కీర్తన దంపతులు విరాళం ఇచ్చారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారి హరిహరనాథ్‌కు రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ ఉపాద్యాయుల చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వాసవీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలి

జగిత్యాలటౌన్‌: ధర్మం, అసింహ, సమానత్వం ప్రపంచానికి తెలియజేసిన వాసవీమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత అన్నారు. యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన వాసనీమాత జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో రవికుమార్‌, కో–ఆప్షన్‌ సభ్యులు గట్టు సతీష్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పదోన్నతితో బదిలీ చేపట్టాలి

రాయికల్‌: ప్రభుత్వ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం రాయికల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బదిలీ ప్రక్రియను జాప్యం లేకుండా జూలైలో చేపట్టాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. మే 5న జిల్లాకేంద్రంలో చేపట్టే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్‌, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లె చిన్నయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అంగడి రవీందర్‌, కన్వీనర్‌ ముక్కెర శేఖర్‌, నాయకులు రాజ్‌ కిశోర్‌, రమేశ్‌, సత్యనారాయణ, నాగభూషణం, సురేష్‌, మధు మండల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, టీఆర్‌టీఎఫ్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement