మల్లాపూర్: జనగణనకు తొలిఘట్టం ప్రారంభమయింది. కేంద్రప్రభుత్వం ప్రజలకు స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మే10వ తేదీ వరకు చేసుకోవచ్చు. ప్రజలే స్వయంగా తమ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. తద్వారా జనగణన కు సమయం ఆదా అవుతుందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో చేపట్టనున్న జనగణన కోసం అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమవుతోంది. జనగణనలో పాల్గొననున్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతోపాటు ఇతర సిబ్బందికి గణనపై పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తోంది. ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు తీయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా 2021లో జనగణన సాధ్యపడలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్క చేపట్టాలని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందులో భాగంగా గతంలో మ్యానువల్ పద్ధతిలో ఈ జనాభా లెక్కలను సేకరించగా.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఈ సారి డిజిటల్ విధానంలో జనగణన ఉండనుంది. అలాగే ప్రజలే నేరుగా తమ వివరాలను సులువుగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
స్వీయ గణనలో నమోదు ఇలా..
ఈ జనగణనలో ప్రజలే నేరుగా పాల్గొనే సౌకర్యం ఉంది. ఇటీవల జరిగిన అధికారుల శిక్షణలో స్వీయ నమోదులోనే తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఉద్యోగి తమకు తెలిసిన 10 నుంచి 15 మందికి స్వీయగణనపై వివరాలు వెల్లడించి నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఈ స్వీయ నమోదులో మొదటగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన https-://se.census.gov.in లోకి వెళ్లాల్సి ఉంది.
మొబైల్స్, కంప్యూటర్ల ద్వారా వివరాల నమోదు
వెసులుబాటు కల్పించిన కేంద్రప్రభుత్వం
ఈ నెల 26 నుంచి మే 10 వరకు అవకాశం


