జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని గ్రామాల్లో సోమవారం నుంచి మే 23 వరకు రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాలోని 64 గ్రామాలను ఎంపిక చేశారు. గతేడాది నిర్వహించిన గ్రామాల్లో కాకుండా ఈ ఏడాది కొత్త గ్రామాలను గుర్తించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం 8 గ్రామాల్లో రైతులతో చర్చావేదికలు నిర్వహించనుంది. ఒక్కో బృందంలో వ్యవసాయ శాస్త్రవేత్తతోపాటు మండల వ్యవసాయ అధికారి, ఏఈవో, వ్యవసాయ విద్యార్థి ఉండనున్నారు. కార్యక్రమాన్ని పరిశీలించేందుకు నోడల్ అధికారిగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అధికారి కె.రాజేశ్‌ను నియమించారు. డీఏవో భాస్కర్ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించనున్నారు.
సాగు విషయాలు తెలియజేసేందుకు..
పంటల సాగులో రైతులు చేస్తున్న తప్పులు, సాగు ఖర్చు తగ్గించుకునే పద్ధతులు, ఎలాంటి పంటలు పండించాలి..? మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా అమలు చేయాలి..? వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇలా సాగు సంబంధిత విషయాలపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా వానాకాలంలో దొడ్డురకం ధాన్యం తగ్గించి సన్నాలు పండించాలని రైతులను కోరనున్నారు. రసాయన ఎరువులను వీలైనంతగా తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించేలా చర్చావేదికలు నిర్వహించనున్నారు. పంట మార్పిడితో ఎలాంటి లాభాలు ఉన్నాయో వివరించనున్నారు. సాగు నీటిని ఉపయోగించే పద్ధతులు, భూసార పరీక్షలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. ప్రధానంగా విత్తనోత్పత్తితో కలిగే లాభాలు, విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడే విషయాలపై చర్చించనున్నారు.
నేటినుంచి జిల్లాలోని 64 గ్రామాల్లో సమావేశాలు
శాస్త్రవేత్తలు, అధికారులతో 8 బృందాల ఏర్పాటు


