పొంచి ఉన్న జలగండం | - | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న జలగండం

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

జిల్లాకేంద్రానికి నిలిచిపోయిన పంపింగ్‌ రోజు విడిచి రోజు సరఫరాకు ప్రణాళిక మిషన్‌ భగీరథ నీరు అంతంతే.. అడుగంటుతున్న ధర్మసముద్రం వేసవి గట్టెక్కేనా..?

ఇబ్బంది లేకుండా చూస్తాం

జగిత్యాల: జగిత్యాల నుంచి నిజామాబాద్‌ వెళ్లే జాతీయ రహదారిపై గాంధీనగర్‌ సమీపంలో వంతెన నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డును తవ్వారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రం శివారులోని ధర్మసముద్రం ఫిల్టర్‌ బెడ్‌ నుంచి జగిత్యాలలోని మూడు వాటర్‌ ట్యాంక్‌లకు వెళ్లే మెయిన్‌ పైప్‌లైన్‌ పగిలిపోయింది. ఫలితంగా పట్టణానికి నీటి సరఫరా బంద్‌ అయింది. ప్రస్తుతం ధరూర్‌ క్యాంప్‌లో ఉన్న మరో ఫిల్టర్‌బెడ్‌ నుంచి రెండు ట్యాంక్‌ల నుంచి మాత్రమే పట్టణానికి నీరు సరఫరా అవుతోంది. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ధర్మసముద్రం నీటినే ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. ఇందులో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. మిషన్‌ భగీరథ మెయిన్‌ పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతు చేయకుంటే.. వేసవి గట్టెక్కడం కష్టతరంగానే మారనుంది.

వరప్రదాయిని ధర్మసముద్రం

జగిత్యాల పట్టణవాసులకు ధర్మసముద్రం చెరువు వరప్రదాయిని. మిషన్‌ భగీరథ లేకముందు ఈ చెరువు నుంచే అక్కడున్న ఫిల్టర్‌బెడ్‌ ద్వారా కొత్తబస్టాండ్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ, తీన్‌ఖని, విద్యానగర్‌ ప్రధాన ట్యాంకులకు నీటిని సరఫరా చేశారు. మిషన్‌భగీరథ నీరు సరఫరా అవుతుండడంతో చెరువు నీటితో అవసరం లేకుండాపోయింది. ఎప్పుడైనా సమస్య వస్తే ధర్మసముద్రం నీటిని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథ మెయిన్‌ పైప్‌లైన్‌ పగిలిపోవడం.. రోజుల తరబడిగా మరమ్మతు చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది. పైగా వేసవికాలం కావడం, ఎండలు ముదిరిపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది. ధర్మసముద్రంలో నీటి మట్టం తగ్గిపోతోంది. ఎస్సారెస్పీ డీ–63 కెనాల్‌ ద్వారా ధర్మసముద్రం చెరువును నింపుతుంటారు. ఆ నీటిని ఫిల్టర్‌బెడ్‌ ద్వారా పట్టణానికి సరఫరా చేస్తుంటారు. ఒక్కసారి ధర్మసముద్రం చెరువు నింపితే ఆర్నెళ్లవరకు నీరు సరిపోతుంది. మిషన్‌భగీరథ పథకం రావడంతో నేరుగా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి ధర్మసముద్రం చెరువు వద్దగల ఫిల్టర్‌బెడ్‌కు అనుసంధానం చేశారు. అప్పటినుంచి చెరువునీటితో పాటు, మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో భగీరథ పైప్‌లైన్‌కు మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, మరికొన్ని ప్రాంతాల్లో పగిలిపోవడం.. తరచూ మరమ్మతుకు వస్తుండడంతో నీరు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రాదో తెలియకుండా ఉంది. ప్రస్తుతం నిజా మాబాద్‌ రహదారిపై వంతెన నిర్మాణంలో భాగంగా రోడ్డును తవ్వడంతో పైప్‌ౖ లెన్‌ పూర్తిగా చెడిపోయింది. దీంతో ప్రస్తుతం ధర్మసముద్రంలోని నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది.

విస్తరణ లేక ఇబ్బందులు

ధర్మసముద్రం చెరువు క్రమంగా కుచించుకుపోతోంది. కట్ట సరిగా లేక నీరు వృథా అవుతోంది. గతంలో కట్టకు ఇసుక బస్తాలువేసి కాపాడగలిగారు. ధర్మసముద్రాన్ని విస్తరించాలని ప్రణాళిక రూపొందించినా ఇప్పటివరకు ఆచరణలో లేదు. కట్టను 1.5 మీటర్ల ఎత్తు పెంచాలని అధికారులు నిర్ణయించారు. పనులు ముందుకు సాగకపోవడంతో నీరు లీకేజీ అవుతోంది.

లీకేజీలు అధికమే...

పట్టణంలోనూ లీకేజీలు అత్యధికంగా ఉన్నాయి. అండర్‌గ్రౌండ్‌లో పాతపైప్‌లు ఉండటంతో లీకేజీ సమస్య ఏర్పడుతోంది. గతంలో అమృత్‌ పథకం కింద రూ.35 కోట్లు మున్సిపాలిటీకి మంజూరై టెండర్లు పూర్తయినా పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. ఈ పథకం కింద పైప్‌లైన్‌ల లీకేజీతో పాటు, నూతన ట్యాంకులు నిర్మించనున్నారు.

రోజు విడిచి రోజు ఇస్తే కష్టమే...

ఎండలు ముదరడం.. భూగర్భజలాలు అడుగంటడం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం రోజువిడిచిరోజు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పట్టణానికి 18.6 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.

ధర్మసముద్రంలో తగ్గుతున్న నీరు

మున్సిపాలిటీ: జగిత్యాల

జనాభా : లక్షకు పైగా

సరఫరా అవుతున్న నీరు :

18.6 మిలియన్‌ లీటర్లు

శిథిలావస్థలో ఫిల్టర్‌బెడ్‌

ధర్మసముద్రం వద్దగల రెండు ఫిల్టర్‌బెడ్‌లు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం ధరూర్‌ క్యాంప్‌లోని మరో ఫిల్టర్‌బెడ్‌కు పైప్‌లైన్‌ను అనుసంధానం చేసి అక్కడ నుంచి పట్టణవాసులకు నీటి సరఫరా చేస్తున్నారు. వేసవికాలం కావడం.. ఒకటే ఫిల్టర్‌బెడ్‌ నుంచి నీటి సరఫరా అవుతుండడంతో రోజువిడిచి రోజు సరఫరా చేసే పరిస్థితి వచ్చింది.

ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. వంతెన నిర్మాణంతో భగీరథ పైప్‌లైన్‌లు పగిలిపోయాయి. త్వరలోనే మరమ్మతు చేడపతాం. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం అక్కడున్న మరో 4ఎంఎల్‌డీ, హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న 11 ఎంఎల్‌డీ ఫిల్టర్‌బెడ్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.

– అనిల్‌, ఏఈ

Advertisement
 
Advertisement
Advertisement