అందరూ ఉత్తీర్ణులయ్యేలా..! | - | Sakshi
Sakshi News home page

అందరూ ఉత్తీర్ణులయ్యేలా..!

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మే 10వరకు నిర్వహణకు చర్యలు వారంలో రెండు నమూనా పరీక్షలు ఫస్టియర్‌లో 2,471, సెకండియర్‌లో 1,454 మంది ఫెయిల్‌

మల్లాపూర్‌: ఇంటర్‌లో ఫెయిలయిన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈనెల 12న ఇంటర్‌ ఫలితాలు విడుదల కాగా.. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈనెల 15 నుంచి ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో నేరుగా తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని చోట్ల ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసి అందరూ పాస్‌ అయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రత్యేక ప్రణాళిక

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులందరూ పాస్‌ అయ్యేలా ఈ విద్యా సంవత్సరంలో వంద రోజుల ప్రణాళిక అమలు చేశారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. అయినా కొన్ని కళాశాలల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 6,645 మంది పరీక్ష రాయగా.. 4,174 మంది ఉత్తీర్ణత సాధించారు. 2,471 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌లో 5,792 మంది పరీక్ష రాయగా.. 4,338 మంది పాస్‌ అయ్యారు. 1,454 మంది ఫెయిలయ్యారు.

ఆయా సబ్జెక్టుల్లోనే..

ఫెయిలయిన విద్యార్థులకు వారు తప్పిన సబ్జెక్టుల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి తరగతులను ప్రారంభించారు. విద్యార్థులను కళాశాలకు పిలిచి ప్రత్యక్షంగా బోధిస్తున్నారు. విద్యార్థులు, ఆధ్యాపకులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వారంలో రెండు నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మే 10వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగనున్నాయి. మే 13 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇంప్రూమెంట్‌ రాసే విద్యార్థులకు సైతం ప్రత్యేక తరగతులకు అనుమతిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement