జగిత్యాల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవలే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తయినా ప్రాదేశిక ఎన్నికల్లో జాప్యం జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోని ఓటరు జాబితాతోపాటు, తాజాగా ఓటు నమోదు చేసుకున్న వారిని కలిపి శుక్రవారం ముసాయితా జాబితా ప్రకటించారు.
పెరిగిన ఓటర్లు 3,278
2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు ఎన్నికల సంఘం ఆమోదం లభించిన ఓటర్లను ఓటరు జాబితాలో చేర్చి సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ లెక్కన అధికారులు ఓటరు జాబితాను సవరణ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3,278 మంది ఓటర్లు పెరిగాయి.
ఇప్పటికే ఆలస్యం
జిల్లా, మండల పరిషత్‌కు సంబంధించి పదవికాలం జూన్ 2024తో ముగిసింది. రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతంలో సర్పంచ్‌గా ఓడిపోయిన వారితోపాటు, కొత్తవారు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
సందడేసందడి
ఈనెల 23 వరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొనడంతో అధికారులు నిర్వహణలో నిమగ్నమయ్యారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సందడి మొదలైంది. గతంలోనే సర్పంచులతోపాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. తాజాగా కొంతమేర రిజర్వేషన్లను మార్చే అవకాశం కనిపిస్తోంది.
ఈసారి 3,278 మంది ఓటర్లు పెరిగారు. ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించాం. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి అన్ని సిద్ధం చేశాం.
– గౌతమ్‌రెడ్డి, జెడ్పీ సీఈవో
మండలాలు : 20
పంచాయతీలు 385
గతంలో ఓటర్లు 6,07,263
ప్రస్తుత ఓటర్లు 6,10,541
పెరిగిన ఓటర్లు 3,278
పోలింగ్ కేంద్రాలు 1123
ఎంపీటీసీ స్థానాలు 216
జెడ్పీటీసీ స్థానాలు 20


