35 ఏళ్ల అనంతరం స్వగ్రామానికి.. | - | Sakshi
Sakshi News home page

35 ఏళ్ల అనంతరం స్వగ్రామానికి..

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

రాయికల్‌: తుపాకీ పట్టి 35 ఏళ్లుగా మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ (ఎంఎంసీ) రాష్ట్రాల్లో అనంత్‌ టీంలో సభ్యుడిగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాయికల్‌ మండలం సింగరావుపేటకు చెందిన బత్తుల కాశీరాం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరాడు. కుటుంబంలో శుభకార్యం ఉండడంతో ఆయన భార్య కారం లక్కీ అలియాస్‌ అనూజతో కలిసి వచ్చారు. బత్తుల కాశీరాం అలియాస్‌ ప్రతాప్‌ అప్పటి పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాలు నచ్చి భార్య మల్లవ్వతో కలిసి 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందగా.. అదేదళంలో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన కారం లక్కీ (అనూజ)ను రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ఖగర్‌లో భాగంగా అనంత్‌ టీంలో పనిచేస్తున్న సుమారు 14 మందితో లొంగిపోయేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు, హోంశాఖకు లేఖ రాశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని గొండియా జిల్లా దారెక్సా పోలీస్‌స్టేషన్‌లో 14మందితో ఐదు నెలల క్రితం లొంగిపోయారు. ప్రస్తుతం కాశీరాం గొండియా పోలీస్‌స్టేషన్‌లో అక్కడి పోలీసుల సంరక్షణలో ఉన్నారు.

రివార్డు ఇస్తే జనజీవన స్రవంతిలోకి..

కాశీరాంపై కేంద్రప్రభుత్వం రూ.35 లక్షల రివార్డు ప్రకటించింది. లొంగిపోయి ఐదునెలలైనా మూడు రాష్ట్రాల్లో ఉన్న కేసుల నేపథ్యంలో ఇంకా పోలీసుల సంరక్షణలోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వివిధ కేసులను పరిష్కరించేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంకా మూడు నెలలు పట్టే అవకాశం ఉందని కాశీరాం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తనకు రివార్డు అందిస్తే స్వగ్రామానికి వచ్చి కుటుంబసభ్యులతో గడపాలని ఉందని, ఇదే తన చివరి కోరిక అని పేర్కొన్నారు. శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి చేరుకున్న ఆయన వెంట పోలీసుల బందోబస్తు కూడా ఉండడం గమనార్హం. తిరిగి ఈనెల 28న మహారాష్ట్ర వెళ్తానని కాశీరాం తెలిపారు. 35 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన కాశీరాంను చూసేందుకు స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ చూస్తుంటే గ్రామంలోనే ఉండాలన్న ఆశ పుడుతోందని ఉద్వేగంగా అన్నారు.

కుటుంబసభ్యులను కలిసిన బత్తుల కాశీరం

శుభకార్యం నిమిత్తం భార్యతో కలిసి ఇంటికి..

రివార్డు అందించి ఉపాధి చూపాలని వినతి

Advertisement
 
Advertisement
Advertisement