టాయ్‌లెట్స్ జాడలేదు.. షెడ్ల ఊసు లేదు
తైబజార్ పేరిట అడ్డగోలు వసూళ్లు
కూరగాయల వ్యాపారుల మనోవ్యథ
పట్టించుకోని పాలకులు
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని గడి బురుజులతో పాటు వేములవాడ రోడ్ వెంట ఐబీరోడ్, గోదాం వద్ద రోజూ కూరగాయల అమ్మకాలు జరుగుతుంటాయి. కోరుట్ల, పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు, వ్యాపారులు ఈ రెండు చోట్ల కూరగాయలు అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీ బుధవారం జరిగే అంగడి సైతం రోడ్డుపైనే జరుగుతోంది. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి కొనసాగుతున్నా ఏ పాలకవర్గం సరైన వసతులు కల్పించకపోవడం విచారకరం. ఈ రెండు చోట్ల సంతలు స్థిరపడిన క్రమంలో ఆయా ప్రాంతాల్లో సరైన స్థలం ఎంపిక చేసి వ్యాపారులకు షెడ్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చి మున్సిపాల్టీ వారు ఆదాయం పొందవచ్చు. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టకుండా పట్టణానికి దూరంగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో జనాలకు అందుబాటులో లేని చోట రూ.6 కోట్లు వెచ్చించి కే వలం కాంట్రాక్టర్ కోసం సమీకృత మార్కెట్ పేరిట ఓ కట్టడం కట్టి వృథాగా వదిలేయడం, గోదాం వద్ద రూ.కోటి వెచ్చించి సగం నిర్మాణం చేసి వదిలేసిన వైనం నేతల నిబద్ధతకు అద్దం పడుతోంది.
అడ్డగోలుగా వసూళ్లు
రోజూ కూరగాయల అమ్మకాలు జరిగే రెండు చోట్ల కనీసం నీటి వసతి కల్పించలేదు. ఈ వేసవిలో తాగడానికి నీరు అందుబాటులో లేక చుట్టు పక్కల ఇళ్ల వారిని నీళ్లు అడుక్కునే దుస్థితి దాపురించింది. ప్రస్తుతం వివాదస్పదంగా మారిన గడి బురుజుల స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి వసతి కల్పించే అవకాశం ఉంది. ఇక కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన మహిళా రైతుల పరిస్థతి దారుణం. పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ నుంచి ఎక్కడా టాయ్‌లెట్స్ వసతి లేదు. ఇంతటి దుస్థితిలో రైతులు నానా తిప్పలు పడుతుండగా.. తైబజారు పేరిట వసూళ్ల పర్వం మాత్రం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని అనేక మున్సిపాల్టీల్లో రైతుల దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని తైబజారు వేలం పాట రద్దు చేయగా ఇక్కడ మాత్రం పాలకులు రూ.16 లక్షల ఆదాయం కోసం తైబజారు వేలం వేసి కూరగాయల రైతులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నారు. తైబజారు వసూళ్లకు వచ్చే వాళ్లు నిర్ధారించిన ధరల ప్రకారం కాకుండా అడ్డగోలుగా వసూలు చేయడం, కాదంటే కసురుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. మున్సిపల్ కొత్త పాలకవర్గం కూరగాయల వ్యాపారులపై జాలి చూపి మార్కెట్లలో వసతులు కల్పించి తైబజారు వసూళ్లను రద్దు చేయించాలని రైతులు కోరుతున్నారు.


