జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్‌ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్‌పల్లిలో పనిచేస్తున్న ఎన్.అరుణ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరిసిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్‌ను ఖమ్మం, గోదావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్‌ను గద్వాలకు బదిలీ చేశారు. అలాగే, ఖమ్మంలో పనిచేస్తున్న వి.మాధవిని మెట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న యశ్వంత్‌సింగ్‌ను కరీంనగర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కోర్టు బెంచ్‌కు న్యాయవాదుల సహకారం అవసరం
జగిత్యాలజోన్: కోర్టు బెంచ్‌కు న్యాయవాదుల సహకారం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జిగా నియమితులైన సునీత రవీందర్‌రెడ్డికి శుక్రవారం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో మాట్లాడారు. కక్షిదారుల కేసులకు సత్వరం మోక్షం కలిగించేందుకు జడ్జిలతో పాటు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. అదనపు జిల్లా జడ్జి సునీత రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదులు, జడ్జిలు సమన్వయంతో పనిచేస్తూ, కేసులకు సత్వర పరిష్కారం లభించేలా చూద్దామని చెప్పారు. మొదటి, రెండవ అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్లు శ్రీనిజ, నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, న్యాయవాదులు పాల్గొన్నారు.
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మహిళలు వ్యాపారాల్లో రాణించాలని డీఆర్‌డీవో పీడీ రఘువరన్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అమ్మక్కపేట గ్రామానికి చెందిన సమాల్ల మమతకు సీ్త్రనిధి ద్వారా రూ.3లక్షల రుణంతో ఎలక్ట్రికల్ ఆటోను అందజేశారు. పాత ఐకేపీ భవనంలో మండల మహిళా శక్తి కుట్టు కేంద్రం స్కూల్ యూనిఫామ్స్ తయారీ హాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఫకీర్‌కొండాపూర్, యామపూర్, ఎర్రాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలు చిన్న వ్యాపారాలే కాకుండా పెద్ద ఇండస్ట్రీయల్ పెట్టి లాభాలను గడించి జీవనోపాధి పొందాలన్నారు. రైతులు తాలుతప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకవచ్చి సిబ్బందికి సహకరించాలన్నారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎపహెం శంకర్, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకట్‌రెడ్డి, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో విఫలం
జగిత్యాలరూరల్: వరిధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని, రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. వారం రోజులుగా వరికోతలు ప్రారంభమైనా ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదన్నారు. గన్నీ బ్యాగులు లేక, హమాలీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, నాయకులు ప్రసాద్, రాంచందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


