జగిత్యాలటౌన్: సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరింది. వేకువజాము నుంచే జగిత్యాల డిపో ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి సంతాపంగా కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అనంతరం డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్తబస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. డిపో వద్ద వంటావార్పు నిర్వహించిన నిరసన తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల సమ్మెతో మెజార్టీ బస్సులు డిపోకే పరిమితమవగా అద్దె బస్సులు యథావిధిగా నడిచాయి.
సమ్మెకు జీవన్‌రెడ్డి సంఘీభావం
ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడానికి కారణం సీఎం రేవంత్‌రెడ్డేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఆరోపించారు. సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటికరించే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని విమర్శించారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, సమ్మెకు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె సునీల్, వి.అరవింద్ మద్దతు తెలిపారు.


