ఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుని పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వస్తుండగా రోడ్డుపక్కన ఉన్న మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన వర్కోలు రామకృష్ణ(కోటి) (28) తన స్నేహితుని పెండ్లి వేడుకలకు బైక్‌పై రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి బుధవారం వచ్చాడు. రిసెప్షన్ వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం తన బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా గాలిపెల్లి సమీపంలోని రోడ్డు పక్కగ గల మైలురాయిని ఢీకొని ఎగిరిపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకొని యువకుడు మరణించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, భార్య లాస్య సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణకు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికేవాడని స్థానికులు తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తన సిబ్బందితో వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మృతుని స్వగ్రామం పారువెల్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.


