నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
కరీంనగర్ అర్బన్: కేడీసీసీ బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. లాభాలు వచ్చినప్పుడు ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా ఇచ్చి తీరా వెనక్కి ఇవ్వాలనడం చరిత్రలో తొలిసారని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం కరీంనగర్‌లోని ప్రధాన కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కేడీసీసీబీ పరిధిలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 71 బ్యాంకులు సేవలందిస్తున్నాయి. మొత్తం 509 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా రికవరీ చేసే నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.
ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా రికవరీ ఏంటంటే
పాలకవర్గాలు ఉన్న 2023–24, 2024–25 కాలంలో బ్యాంకులు ఊహించని లాభాలు గడించాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరానికి 80 రోజులు ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటెండర్ నుంచి డీజీఎం వరకు ఉద్యోగ హోదాను బట్టి రూ.2లక్షల నుంచి రూ.8లక్షల వరకు నజరానా అందుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పాలకవర్గాలు రద్దవడంతో ఐఎండీ, ఆర్‌బీఐ, నాబార్డు, టెస్కాబ్ వంటి వాటితో భాగస్వామ్యమైన హైలెవల్ కమిటీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం ఒక్కో ఆర్థిక సంవత్సరానికి 30 రోజులే తీసుకోవచ్చని, రెండు దఫాలకు గానూ 60రోజులకు అర్హత మాత్రమేనని పేర్కొంది. అంటే ఈ లెక్కన మిగతా వంద రోజుల ఇన్సెంటివ్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
ఉద్యోగులు ఏమంటున్నారంటే
బ్యాంకులు ఇన్సెంటివ్‌లు ఇవ్వడం సహజం కానీ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ఐటీ చెల్లించి ఏడాది దాటుతోందని వాపోతున్నారు. చెల్లించిన ఐటీని ఎవరు ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన వాళ్లు, వేరే ఉద్యోగాలకు వెళ్లినవారు ఎలా కడుతారన్నది ప్రశ్న. నిబంధనల పేరిట తమను మానసికంగా హింసిస్తున్నారని అందుకే ఆందోళన బాట పట్టామని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లబ్యాడ్జీలు, వినతులు, సామూహిక సెలవు
హైలెవల్ కమిటీ నోటీసులపై తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తునే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బుధవారం నుంచి ఈ నెల 24వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ఆందోళన, ఈ నెల 23, 24 తేదీల్లో అధికారులకు మెమోరండం సమర్పించడం, ఈ నెల 27న డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమాలు, 29న ధర్నాతో పాటు సామూహిక సెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా, మే 2న ఒక రోజు సమ్మె, నిరసన కార్యక్రమాలు తదుపరి హైలెవల్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు.
ఇన్సెంటివ్ ఇచ్చి రికవరీ అనడం హైలెవల్ కమిటీకి తగదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఇచ్చిన ఏడాదికి తిరిగి ఇవ్వమనడం భావ్యమా..? ఉద్యోగుల కృషి లేకుండా లాభాలు వచ్చాయా..? మానవతా ధృక్పతంతో వ్యవహరించాలే తప్పా మానసికంగా వేధించడం తగదు.
– గోనె హన్మంతరావు, తెలంగాణ కోఅపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
బ్యాంకు ఉద్యోగుల ఆందోళన బాట
ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు
ఈ నెల 24 వరకు భోజన విరామంలో ఆందోళన
మే 2నుంచి సమ్మె.. నిరసన


