కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్‌లో రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన విత్తనాలను సంస్థ ద్వారా అందిస్తామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు, ఎఫ్‌పీఓలు, ఏఆర్‌ఎస్‌కే ప్రతినిధులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ కరీంనగర్ యూనిట్ రంగపేట నుంచి నాణ్యమైన విత్తనాలను ఉమ్మడి జిల్లా రైతులకు సరఫరా చేస్తామని తెలిపారు. రైతులు పండించిన విత్తనాలనే సేకరించి, వాటిని అధునాతన ల్యాబ్‌ల్లో పరీక్షించి, నాణ్యత నిర్ధారణ అయిన తర్వాతే తిరిగి రైతులకు సాగు కోసం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకాల్లో ప్రధానంగా బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, జేజీఎల్ 27356 రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దొడ్డు రకాల విషయానికి వస్తే కేఎన్‌ఎం 118, ఎంటీయూ 1010 రకాలు నిల్వ ఉంచినట్లు తెలిపారు. డీలర్లు ఎట్టి పరిస్థితులో సంస్థ విత్తనాలు అమ్మాల్సిందేనని సూచించారు. కేవలం రాయితీపై ఇచ్చే విత్తనాల విక్రయానికే పరిమితం కాకుండా, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల విత్తనాలను విక్రయించాలని ఆదేశించారు. లైసెన్స్ ఉన్న ప్రతి డీలర్ తప్పనిసరిగా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను తమ దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ గ్రామాన ప్రభుత్వ విత్తనాలను రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, సీడ్ కార్పొరేషన్ మేనేజర్ రాజీవ్ కుమార్, కరీంనగర్ ప్రాంతీయ మేనేజర్ విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సబిత, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, విత్తన అధికారులు శ్రీకాంత్, మౌనిక, డీలర్లు, ఎఫ్‌పీఓ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన విత్తన విక్రయానికి ప్రణాళిక
సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి
ప్రభుత్వ విత్తనాల విక్రయానికి ప్రత్యేక కృషి
కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా


