సాదా సీదా | - | Sakshi
Sakshi News home page

సాదా సీదా

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

సాదాబైనామాలకు మోక్షం సాఫీగా భూముల క్రమబద్ధీకరణ జిల్లాలో 35,267 దరఖాస్తులు సర్వేనంబర్లు 41,218 జీవో 76తో తొలగిన అడ్డంకులు

జగిత్యాల: గతంలో భూములు కొనాలన్నా.. అమ్మాలన్నా.. సాదాబైనామాపై రాయించుకునేవారు. కాలక్రమేణా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ రావడంతో ఈ కాగితాలకు విలువ తగ్గిపోయింది. తర్వాత కాలంలో ధరణి పోర్టల్‌ రావడంతో పట్టా ఉన్నవారికే అన్ని పథకాలకు లబ్ధి పొందే అవకాశం కల్పించారు. అప్పటినుంచి సాదాబైనామాపై భూములు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. భూమి సాగులో ఉన్నప్పటికీ వారికి పట్టా హక్కు లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పో యింది. ఈ క్రమంలో ప్ర భుత్వం ఇటీవల సాదాబైనామాల పరిష్కారం కో సం జీవో నంబరు 76ను విడుదల చేసింది. ఈ లెక్కన జిల్లాలో పెండింగ్‌లో 35, 267 దరఖాస్తులకు పరి ష్కా రం కానున్న నేపథ్యంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

భూభారతిలోనూ సమస్యలే..

భూముల విషయంలో పట్టాతోపాటు అన్ని వివరాలు పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తోంది. సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ సెక్షన్‌ 6, రూల్‌ నంబరు 6లో నిబంధనలు పొందుపర్చింది. దీని ప్రకారం ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరం కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అఫిడవిట్లు ఇవ్వాలని నిబంధన ఉండటంతో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు. ఎవరిని అడిగినా అమ్మకందారుడు ముందుకు రాలేదు. ఇటీవల వచ్చిన భూభారతి చట్టంతోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కా రం కాలేదు. ఫలితంగా రైతుల్లో ఆశలు నిరా శలయ్యాయి. తాజగా ప్రభుత్వం జీవో నంబరు 76 విడుదల చేయడంతో కొంత మేర వెసులుబాటు కలిగింది.

అఫిడవిట్‌ ఇస్తే చాలు..

2014 జూన్‌ 2లోపు భూముల క్రమబద్ధీకరణకు గతంలో తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఆ పరిష్కారం కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినప్పటికీ అందులోనూ కొనుగోలుదారుడు, అమ్మకందారుడు మధ్య ఒప్పందం ఉండాలనే నిబంధన ఉండటంతో సమస్య పరిష్కారానికి నోచలేదు. తాజాగా జీవో విడుదల చేయడంతో కొనుగోలుదారుడు అఫిడవిట్‌ ఇస్తే సాదాబైనామా పరిష్కరించనున్నారు. జీవో 76 ప్రకారం భూమి కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్‌ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తో పాటు, భూమి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలిస్తారు. అఫిడవిట్‌ అందించిన తర్వాత 30 రోజులు దరఖాస్తును పెండింగ్‌లో పెడతారు. ఆ లోపు దరఖాస్తుకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే రైతుకు సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఒకవేళ సాదాబైనామాకు సంబంధించిన తప్పుడు దరఖాస్తు చేసినా మళ్లీ సర్టిఫికెట్‌ను రద్దు కూడా చేసే అవకాశం ఉంది.

రైతుల ఎదురుచూపు

గతంలో భూములకు డిమాండ్‌ లేకపోవడంతోపాటు నమ్మకంగా మనుషుల మధ్య ఒప్పందాలే అధికంగా ఉండేవి. దీంతో తెల్లకాగితాలపైనే ఎక్కువగా క్రయవిక్రయాలు జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతం భూముల ధరలు పెరగడం, భూములపై చట్టబద్ధత హక్కులు రావడంతో సాదాబైనామా ద్వారా కొన్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020 అక్టోబర్‌లో 212 జీవో ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అవి కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు వెసులుబాటు కలగడంతో కొంత మేరకు దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.

ఆర్డీవో

ఆధ్వర్యంలోనే..

సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీవో ఆధ్వర్యంలోనే జరుగుతుంది. 2014 జూన్‌ కన్నా ముందు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి మోఖాలో ఉన్నట్లు చూపాల్సి ఉంటుంది. ఆర్డీవో పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం సర్టిఫికెట్‌ జారీ చేసి పట్టాదారు పాస్‌బుక్‌ అందజేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement