జగిత్యాల: జిల్లాకేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీని యర్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ వెళ్లారు. ఇటీవల నామి నేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సీనియర్లకు అవకాశం దక్కలేదనే అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య పొసగడం లేదని సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపైనే సీఎంను కలుస్తున్నట్లు పైకి చెబు తున్నా.. అలాంటిదేమీ లేదని మంత్రి పేర్కొన్నారు. సీఎంను సోమవారం కలవాల్సి ఉండగా.. అనివా ర్య కారణాలతో రద్దయ్యిందని పేర్కొన్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో సీనియర్ నాయకులంతా హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. ఏదేమైనా మంత్రి, ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కో–ఆప్షన్ల విషయంలో సీనియర్లకు అవకాశం దక్కలేదని, గతంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసిన వారికే ఇస్తారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లంతా జీవన్‌రెడ్డి వైపు వెళ్లకుండా ఉండేందుకే సీఎం పిలిచినట్లు సమాచారం.


