రాయికల్: జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో అభిమానులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, మరికొంత మంది అనుచరులు తనను పార్టీ నుంచి పొమ్మనలేక పొగపెట్టారని, ఇందులో ఎమ్మెల్యే సంజయ్ ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. అధిష్టానానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోకపోవడంతోనే నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకే ఈనెల 20న బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు రేవంత్‌రెడ్డి అనేక మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకొచ్చాక విస్మరించారన్నారు. తులం బంగారం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. అదే కేసీఆర్ అయితే మొదటగా కల్యాణలక్ష్మీకి రూ.50 వేల నుంచి రూ.లక్ష ఇచ్చారని గుర్తుచేశారు. రైతుల కోసం ప్రాజెక్ట్‌లు నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, నాయకులు మ్యాకల రమేశ్, బత్తిని భూమయ్య, రాకేశ్‌నాయక్, మచ్చ శేఖర్, అంజయ్య, స్వామిరెడ్డి, గుమ్మడి సంతోష్, సిరిపురం గంగాధర్, అత్తినేని గంగారెడ్డి పాల్గొన్నారు.


