ఫైల్‌కు రూ.10 వేలు..! | - | Sakshi
Sakshi News home page

ఫైల్‌కు రూ.10 వేలు..!

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

● కోరుట్ల మున్సిపాలిటీలో షరా‘మాములు’ ● ఇంటి పర్మిషన్‌కు పేదల తిప్పలు ● ఉన్నతాధికారులకు పట్టని వైనం

కోరుట్ల: ఇల్లు.. పెళ్లి.. ఈ రెండు ప్రతిఒక్కరి జీవితంలో కీలకఘట్టాలు. బంధుమిత్రుల సహకారం.. చేతిలో కాసిన్ని డబ్బులు ఉంటే పెళ్లితంతును ఎలాగోలా ముగించవచ్చు.. కానీ ఇక్కడ ఇల్లు కట్టడం కష్టతరంగా మారిపోయింది. పర్మిషన్‌ తీసుకోవడం మొదలు.. ఇల్లు పూర్తయినా చిన్నపాటి నిబంధనల పేరిట అధికార యంత్రాంగం ‘కాసులవసూళ్ల’కు తెగబడటం కోరుట్లలో ‘కామన్‌’గా మారిపోయింది. అటు ఉన్నతాధికారులు.. ఇటు మున్సిపల్‌ పాలకవర్గం కలిసి అధికారుల వసూళ్లపర్వానికి అడ్డుకట్ట వేయాలన్న పట్టింపు లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

రూ.10 వేలు ముట్టాల్సిందే..

ఇల్లు నిర్మాణ అనుమతితోపాటు ఇంటి ప్లాన్‌ కోసం సాధారణంగా అర్కిటెక్చర్‌లను కలవడం ఆనవాయితీ. ఇక్కడే మొదలవుతోంది అధికారుల వసూళ్ల పర్వం. కోరుట్ల మున్సిపల్‌ అధికారుల సూచనల మేరకు అర్కిటెక్చర్లు తమ ఫీజుతోపాటు తమకు ఇవ్వాల్సిన అమ్యామ్యాలు కలిపి రూ.10వేలు వసూలు చేయాల్సిందే. వాస్తవానికి ఇందులో అర్కిటెక్చర్లకు అందేది కేవలం రూ.2వేల నుంచి రూ.3వేలు మాత్రమే. మిగిలిన సొమ్మంతా మున్సిపల్‌ అధికారుల ఖాతాలోకే చేరుతోంది. ఇలా అయితేనే సదరు అర్కిటెక్చర్‌ ఇచ్చే ఇంటి నిర్మాణ పనులకు ఎలాంటి కొర్రీలు లేకుండా అనుమతులు దక్కుతాయి. కాదంటే సెట్‌బ్యాక్‌, లింకు డాక్యుమెంట్ల దగ్గర నుంచి పహాణి కాపీలు కావాలని అధికారులు అడ్డగోలు కాగితాలు అడుగుతారు. ఈ ధ్రువీకరణ పత్రాలు తీసుకురాలేక.. నానా తిప్పలు పడలేక ఇంటి నిర్మాణం చేపట్టేవారు అర్కిటెక్చర్లు చెప్పిన రీతిలో అనుమతి కోసం అడిగినంతా ఇస్తున్నారు.

నిత్యావసరాల ధరలు పెరిగినట్లే..

ఇంటి నిర్మాణ అనుమతి పైళ్లకు అధికారులకు ఇచ్చే షరా ‘మామూళ్లు’ ఎప్పుడు ఒకేలా ఉండవు. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు ఎలా పెరుగుతాయో.. అదే రీతిలో పెరిగిపోతున్నాయి. ఆరేళ్ల క్రితం ఇంటి నిర్మాణ ఫైలుకు మున్సిపల్‌ ‘మామూళ్లు’ కేవలం రూ.4 వేలు ఉండేది. అప్పుడు అర్కిటెక్చర్లు రూ.6వేలు తీసుకుని అనుమతి కోసం దరఖాస్తు చేసేవారు. ఏడాది క్రితం కోరుట్ల మున్సిపాలిటీలో ఓ పైస్థాయి అధికారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.. మరి మనకూ ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకే ఇంటి నిర్మాణ ఫైల్‌ పర్మిషన్‌ ధరలు పెంచాలి..’ అని సిఫార్సు చేసినట్లు సమాచారం. వెంటనే ఇంటి నిర్మాణ అనుమతి ధర ఫైలుకు రూ.8వేలకు చేరింది. ఈమధ్య మళ్లీ సరుకుల ధరలు పెరిగినట్టున్నాయి.. అందుకే అదనంగా మరో రూ.2వేలు చెల్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టుతుండడంతో అర్కిటెక్చర్లు తూచ తప్పకుండా సదరు అనధికార నిబంధనలు అమలు చేస్తూ ఫైలుకు రూ.10వేల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈవిషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ మాట్లాడుతూ.. అర్కిటెక్చర్లు తీసుకునే డబ్బులకు.. తమకు ఎలాంటి సంబంధమూ లేదని.. ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అనుమతులు ఇస్తామని, ఎలాంటి అదనపు వసూళ్లు ఉండవని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement