అందరి కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

అందరి కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

జగిత్యాలక్రైం: అందరి కృషి ఉంటే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్‌ ఆవరణలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కోసం ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్‌ ఎ లైవ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలన్నారు. వేగం ప్రాణం తీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. ఎస్పీ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటి నివారణకే అరైవ్‌ ఎలైవ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగం, ట్రాఫిక్‌ నియమాలను పాటించకపోవడమే ప్రధానకారణాలుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, డీఎస్పీ రఘుచందర్‌, ఆర్టీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సమిండ్ల వాణి, సీఐలు కరుణాకర్‌, ఎస్సైలు సుప్రియ, సదాకర్‌, కుమారస్వామి, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని కలెక్టర్‌, ఎస్పీ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లాకేంద్రంలో 150 సీసీ కెమెరాలను ప్రారంభించారు. కెమెరాలు ఉన్నాయన్న భయం నిందితుల్లో ఉంటుందని, ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, అపార్ట్‌మెంట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులు, క్రాస్‌రోడ్లు, బిజీ సెంటర్లు, మార్కెట్‌ ప్రాంతాల్లో తప్పనిసరని పేర్కొన్నారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కళాశాల, పాఠశాల యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల ప్రతినిధులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement