ధర్మపురి: స్వర్గీయ శ్రీపాదరావు సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీపాదరావు 27వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అజాత శత్రువుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప మహానీయుడని కొనియాడారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు చీపిశెట్టి రాజేశ్ తదితరులున్నారు.
కోరుట్లలో మళ్లీ వసూళ్ల పర్వం
కోరుట్ల: చిన్నాచితకా పంచాయితీలను అడ్డుపెట్టుకుని కోరుట్లకు చెందిన ఓ నేరస్తుల ముఠా మళ్లీ వ్యాపారుల నుంచి వసూళ్లకు దిగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. గతంలో కోరుట్ల పట్టణంలో పలు నేరాలకు పాల్పడిన ముఠా ఈ పనికి పాల్పడుతోందన్న అనుమానంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెల్సింది.
వ్యాపారుల నుంచి..
పట్టణంలోని ఇద్దరు వ్యాపారులను ముఠాలోని కీలక వ్యక్తి వారం క్రితం బెదిరించినట్లు సమాచారం. సదరు వ్యాపారులిద్దరూ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. డబ్బుల వసూళ్లు, భూతగాదాలు, ఆస్తి పంపకాల పంచాయితీలు వంటి అంశాలను ఆసరాగా చేసుకుని ఆ ముఠా కొందరి వద్ద రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ముఠాకు డబ్బు ఇచ్చి ఇబ్బంది లేకుండా చూసుకున్నట్లు సమాచారం. ముఠా తమ కార్యకలాపాలను పెంచడంతో ఇద్దరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ముఠాపై గతంలోనే క్రిమినల్ కేసులు నమోదు కావడం.. మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముఠా కోసం తీవ్రంగా వెతుకుతున్నట్లు తెలిసింది.
సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 22 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


