జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడు తాళ్లపల్లి యాదగిరి(52) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. వివరాలు.. గోదావరిఖని ఐబీకాలనీకి చెందిన తాళ్లపల్లి యాదగిరి ఎన్టీపీసీ ప్రాజెక్టులోని గోరఖ్‌పూర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం షిప్టుకు హాజరయ్యాడు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్ సర్వీస్ బిల్డింగ్‌లో అకస్మాత్తుగా పడిపోయాడు. కార్మికులు స్థానిక ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించగా ప్రాథమిక పరీక్షల అనంతరం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య యాకమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు హెచ్‌ఆర్ విభాగానికి డిమాండ్ నోటీసు అందించారు. ఆన్ డ్యూటీలో మృతి చెందడంతో రూ.30 లక్షల ఎక్స్‌గ్రేసియా, కుటుంబంలో ఇద్దరికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, దహన సంస్కారాలకు రూ.50 వేలు, రవాణా ఖర్చు చెల్లించాలని డిమాండ్ చేశారు.
విషపురుగు కాటుకు కార్మికుడి మృతి
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన పట్నం లెనిన్(32)అనే భవన నిర్మాణ రంగ కార్మికుడు విషపురుగు కాటు వేయడంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేసీ్త్ర వద్దకు ఆదివారం కూలీపనికి వెళ్లిన లెనిన్.. పనులు ముగించుకుని ఇంటికి చేరాడు. నీళ్లు వేడిచేసుకునేందుకు వంటచెరుకు తీస్తుండగా విషపురుగు కాటు వేసింది. కాల్వశ్రీరాంపూర్‌లోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దపల్లికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మృతుడికి భార్య వనిత, తల్లిదండ్రులు ఉన్నారు.
చందాలతో అంత్యక్రియలు
లేనిన్ కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. కనీసం అంత్యక్రియలు నిర్వహించే స్థితిలో కూడాలేదు. దీంతో గ్రామస్తులు తలాకొంత పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. లెనిన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కూర్మాచలం ఆంజనేయులు (70) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు భార్య మూడేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి నిద్రించాడు. ఉదయం లేచి చూసే సరికి ఇంటి పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఆంజనేయులు కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు.


