పెగడపల్లి: జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు ఆ శాఖకు గుదిబండగా మారాయి. జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల నుంచి 2026 ఫిబ్రవరి వరకు రూ.25.425 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. సామాన్య ప్రజలకు సంబంధించి గృహ, వాణిజ్య, పరిశ్రమలు.. ఇలా ఏదైనా విద్యుత్ బిల్లు బకాయి ఒక నెల చెల్లించకుంటే సరఫరా నిలిపి వేస్తామని అధికారులు నోటీసులు ఇస్తుంటారు. ఇంకా ఆలస్యమైతే తక్షణమే కనెక్షన్ తొలగిస్తారు. బిల్లు చెల్లించి రశీదు చూపితేగానీ తిరిగి కనెక్షన్ ఇవ్వరు. ఆలస్యమైన దానికి తదుపరి బిల్లులో ప్రత్యేక చార్జి వసూలు చేస్తారు.
పంచాయతీల్లోనే ఎక్కువ..
జిల్లాలో 385 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడక ముందు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. పంచాయతీల్లో సాధారణంగా వీధి దీపాలు, మంచినీటి సరఫరా చేసే మోటార్లు, పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ వినియోగిస్తారు. ఆయా పంచాయతీల్లో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కొన్ని పంచాయతీలు సుమారు మూడేళ్లుగా బిల్లు చెల్లించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికై న పాలకవర్గాలకు వచ్చే నిధులను గతంలో చేసిన పనులకు చెల్లిస్తున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మెట్‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సర్వీసుల బకాయిలు చెల్లించకున్నా విద్యుత్ సరఫరా నిలిపివేయొద్దని ఆదేశాలున్నాయని, దీంతో చేసేదేమీ లేక తాము మిన్నకుండిపోవాల్సి వస్తోందని ట్రాన్స్‌కోకు చెందిన ఓ అధికారి తెలిపారు. నెలనెలా బకాయిల భారం పెరిగి విద్యుత్ సంస్థకు భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు విడుదల చేసి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు కోరుతున్నారు.


