మామిడి పూత.. రైతుల్లో చింత
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు మామిడికి ప్రతికూలంగా మారుతున్నట్లు కనబడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో రావాల్సిన మామిడి పూత ఇప్పటికీ ఇంకా చెట్లపై కనబడటం లేదు. పూత వస్తుందనే ఆలోచనలతో ముందుగానే తెగుళ్లు, పురుగులు ఆశించకుండా మామిడితోటల్లో రైతులు రసాయన ముందులు పిచికారీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం.. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుండటం మామిడి రైతులకు కొంత ఆందోళనకరంగా మారుతోంది.
37 వేల ఎకరాల్లో మామిడి సాగు
జిల్లాలో దాదాపు 37 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మామిడి మార్కెట్ ఉండటం.. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు నేరుగా ఢిల్లీ వంటి నగరాలకు తరలించడం.. తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు కూడా పెరగడంతో మామిడికి మంచి రేటు వస్తుందని రైతులు ఆశపడ్డారు. ఈ క్రమంలో ఐదేళ్లలో మామిడితోటల విస్తీర్ణం కూడా బాగానే పెరిగింది. అయితే నాలుగేళ్లుగా మామిడికి పూత రాకపోవడం, పూత వచ్చినా నిలవకపోవడం.. విపరీతంగా తేనేమంచు పురుగు ఆశించడంతో రైతుకు ఏ మాత్రం దిగుబడులు రాలేదు. దీంతో కొంతమంది రైతులు ఇప్పటికే మామిడి తోటలను తొలిగించారు. మరికొంత మంది రైతులు ఈ ఏడాది పంట దిగుబడి బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు.
మామిడి పూతకు సమయమిదే
మామిడి పూత సాధారణంగా నవంబర్ చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి మొదటి వారం వరకు వస్తుంటుంది. మామిడి సాగులో 8 నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తైతే.. పూత నుంచి కోత వరకు నాలుగు నెలల పాటు యాజమాన్య పద్ధతులు మరో ఎత్తు. ఇప్పటికే ఎకరాకు రూ.20వేల విలువ గల రసాయన మందులను రైతులు పిచికారీ చేశారు. రెండేళ్లుగా వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కురవడంతో భూమి తేమతో కూడి ఉంది. దీనికి తోడు వాతావరణంలో మార్పులు ఏర్పడి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం ఉండటం కూడా పూతపై ప్రభావం చూపిస్తోంది. పూత విచ్చుకునే దశలో చలి ప్రభావంతో పాటు తుపాన్ల ప్రభావంతో పొడి వాతావరణం ఉండటం లేదు. గతేడాది ఆలస్యంగా పూతరావడం, పూత వచ్చే సమయానికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడి వాతావరణంతో పూత సగం రాలిపోయింది. తేమ వాతావరణం ఉండటంతో తేనేమంచు పురుగు కూడా ఆశించింది. అక్కడక్కడ కొంతమేర వచ్చిన పూతలోని రసాన్ని పీల్చుతున్నాయి. దీంతో పూత ఎండిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. ఈ ఏడాది తేమ వాతావరణం ఉండటం వల్ల పూత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఉద్యాన అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ చివరికి వచ్చినా పూత ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆందోళన పడుతున్నారు. మూడేళ్లుగా పూత సరిగ్గా రాకపోవడంతో కొంతమంది రైతులు మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టడం లేదు.


